ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

డిక్లరేషన్​ ఇచ్చాకే జగన్ తిరుమలలో అడుగు పెట్టాలి: చంద్రబాబు

ప్రశాంతమైన రాష్ట్రంలో సీఎం జగన్​ మతచిచ్చు రగిలిస్తూ...ఓటుబ్యాంకు రాజకీయాల కోసం రాష్ట్రాన్ని తగలబెడుతున్నారని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి జగన్​కు ఏ మతంపైనా విశ్వాసం లేదని మండిపడ్డారు. డిక్లరేషన్​ ఇచ్చాకే జగన్ తిరుమలలో అడుగు పెట్టాలని డిమాండ్ చేశారు. తమది సెక్యులర్ పార్టీ అన్న చంద్రబాబు..., ఆలయాలపై దాడులను, మత విద్వేషాలను సహించేది లేదని తేల్చి చెప్పారు.

జగన్​కు ఏ మతంపైనా జగన్​కు విశ్వాసం లేదు
జగన్​కు ఏ మతంపైనా జగన్​కు విశ్వాసం లేదు

By

Published : Sep 22, 2020, 4:43 PM IST

Updated : Sep 22, 2020, 8:12 PM IST

ఓటు బ్యాంకు రాజకీయమే తప్ప, ఏ మతంపైనా జగన్​కు విశ్వాసం లేదని తెలుగుదేశం అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ప్రశాంతమైన రాష్ట్రంలో మతచిచ్చు రగిలిస్తూ...,ఓటుబ్యాంకు రాజకీయాల కోసం రాష్ట్రాన్ని తగలబెడుతున్నారని ధ్వజమెత్తారు. పార్టీ నాయకులు, అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్ధులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన...ముఖ్యమంత్రి జగన్​పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎన్నికలకు ముందు ఓట్ల కోసం హిందూ మతం స్వీకరించినట్లు డ్రామాలు ఆడి..,గెలిచాక బైబిల్ పక్కన పెట్టుకుని ప్రమాణ స్వీకారాలు చేశారని విమర్శించారు. ముఖ్యమంత్రి ఏ మతస్థుడైనా కావచ్చు కానీ అన్ని మతాలను సమదృష్టితో చూడాలని హితవు పలికారు.

వైకాపా ఫేక్ పార్టీ, ఫ్రాడ్​ పార్టీ

రాష్ట్రంలో అన్ని ప్రార్థనా మందిరాలను కాపాడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై ఉందని చంద్రబాబు గుర్తుచేశారు. తమది సెక్యులర్ పార్టీ అన్న చంద్రబాబు...,ఆలయాలపై దాడులను, మత విద్వేషాలను సహించేదిలేదని తేల్చిచెప్పారు. ఆలయాలు, దళితులపై దాడులు జరుగుతున్నా స్పందించని ముఖ్యమంత్రి ఎక్కడైనా ఉన్నాడా ? అని మండిపడ్డారు. మంత్రుల వ్యాఖ్యలకు సాధువులు కంటతడి పెట్టే దుస్థితి ఏర్పడిందని ధ్వజమెత్తారు. వైకాపా ఫేక్ పార్టీ, ఫ్రాడ్స్​పార్టీ..బ్లాక్ మెయిలింగ్​లో, మానిప్యులేషన్​లో నిష్ణాతులైన నాయకులు ఆ పార్టీలో ఉన్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

ఒకరు పోతే వంద మందిని తయారు చేస్తాం

రాజధాని అమరావతి, ఫైబర్​గ్రిడ్​పై వైకాపా దుష్ప్రచారం చేస్తోందని...,రూ.770కోట్లు ఖర్చు చేసిన ఫైబర్ గ్రిడ్​లో 2 వేల కోట్ల అవినీతి ఎలా జరుగుతుందని చంద్రబాబు ప్రశ్నించారు. వైకాపా అబద్ధాలకు, తప్పుడు ప్రచారానికి ఇంతకన్నా రుజువేం కావాలన్నారు. కేంద్రం వరి మద్దతు ధర పెంచకపోయినా...వైకాపా ఎంపీలు నోరు తెరవడం లేదని విమర్శించారు. తెలుగుదేశంపై కక్ష సాధింపే తప్ప రాష్ట్ర ప్రయోజనాలపై వైకాపా ఎంపీలకు దృష్టి లేదని దుయ్యబట్టారు. సాక్ష్యాధారాలు ఉన్నా...మంత్రి జయరామ్​పై చర్యలు తీసుకోవటం లేదని మండిపడ్డారు. అన్యాయంగా అచ్చెన్నాయుడిని 80రోజులు జైలుకు పంపారని...,ప్రలోభాలు పెట్టి కొందరిని లాక్కున్నంత మాత్రాన తెలుగుదేశానికి నష్టం ఏమీ లేదని స్పష్టం చేశారు. ఒకరు పోతే వందమందిని తయారుచేసే సత్తా తెదేపాకు ఉందన్నారు. రాజీనామా చేయించిన తర్వాతే పార్టీలోకి తీసుకుంటామన్న జగన్ మాట ఏమైందని ప్రశ్నించారు.

పవిత్ర న్యాయస్థానాలపై బురద జల్లుతారా..

తనపై గతంలో 26 విచారణలు చేయించారని...,14సభా సంఘాలు, 3 ఉపసంఘాలు, 4 జ్యుడిషీయల్ ఎంక్వైరీలు, 1 సీబీసీఐడీ విచారణ వేసినా ఏదీ రుజువు చేయలేకపోయారని గుర్తు చేశారు. సమాజంలో ఎవరే తప్పు చేసినా న్యాయస్థానాలు సరిచేస్తాయన్నారు. అలాంటి పవిత్ర న్యాయమూర్తులు, కోర్టులపై వైకాపా బురద జల్లటం హేయమని మండిపడ్డారు. రైతుల పంపుసెట్లకు మీటర్ల ఏర్పాటును ప్రతిఘటించాలని నేతలకు పిలుపునిచ్చారు. అన్ని ప్రాంతాల్లో రైతులకు పార్టీ నేతలు అండగా ఉండాలని సూచించారు.

అన్యమతస్థుడైన జగన్ డిక్లరేషన్ ఇస్తే తప్పేంటి ?...

డిక్లరేషన్​ ఇచ్చాకే జగన్ తిరుమలలో అడుగు పెట్టాలని తెదేపా అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లా తెదేపా నేతలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన...అన్యమతస్థుడైన సీఎం జగన్ డిక్లరేషన్ ఇస్తే తప్పేంటని నిలదీశారు. బ్రహ్మోత్సవాల్లో ఒంటరిగా పట్టువస్త్రాలు సమర్పిస్తే...అతనికే కాకుండా రాష్ట్రానికే అరిష్టమన్నారు. అన్యమత ఆచారాలను జగన్ కించపర్చరాదన్న చంద్రబాబు...,రేపు జిల్లావ్యాప్తంగా అన్నిచోట్ల నిరసనలు జరపాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. దేవాలయాలపై దాడులను తేలిగ్గా వదిలేస్తే చర్చిలు, మసీదులపైనా దాడులకు తెగిస్తారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని అగ్నిగుండంగా చేయాలని వైకాపా నాయకులు చూస్తున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు.

ఇదీచదవండి

దిల్లీలో పలువురు ఎంపీలను కలిసిన అమరావతి మహిళా జేఏసీ

Last Updated : Sep 22, 2020, 8:12 PM IST

ABOUT THE AUTHOR

...view details