పథకాల పేరుతో 10% ప్రజలకిచ్చి మిగతా 90% సీఎం జగన్ దోచుకుంటున్నారని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. అప్పులు చేస్తూ వాటి కోసం ప్రజల జేబులను ఖాళీగా మారుస్తూ వారి కష్టార్జితాన్ని దండుకుంటున్నారని మండిపడ్డారు. జగన్ నిర్వాకంతో ఒక్కో కుటుంబంపై ఏడాదికి లక్షకుపైగా భారం పడుతోందన్నారు. ఈ పాలనపై ప్రజలు పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైందని, ప్రభుత్వ పన్నులు బాదుడుపై ప్రతిపక్ష తెదేపా చేస్తున్న పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపు ఇచ్చారు. ఈ మేరకు చంద్రబాబు మంగళవారం ట్వీట్ చేశారు.
‘ఒక పేద మధ్య తరగతి కుటుంబం బతకడానికి 2019లో నెలకు రూ.11 వేలు సరిపోయేది. అదే 2020 నాటికి నెలకు రూ.20 వేలకుపైగానే ఖర్చవుతోంది. గతంలో సంతోషంగా, సంక్షేమంగా సాగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయాణం ఇప్పుడు సంక్షోభం దిశగా పయనిస్తోంది. చెత్త పన్నులు, పెరిగిన విద్యుత్తు ఛార్జీలు, భగ్గుమంటున్న నిత్యావసరాల ధరలతో ప్రజల జేబులు గుల్లవుతున్నాయి. ఇక ఇసుక, మద్యం వంటి వాటితో జరిగే దోపిడీ సరేసరి. వైకాపా సర్కారు బాదుడే బాదుడు విధానంతో రాష్ట్ర ప్రజలు విలవిల్లాడుతున్నారు...’ అని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ విధానాన్ని ఎండగడుతూ ప్రజలు పోరాటం చేయాలన్నారు.