ప్రతిపక్ష నేతలపై కక్ష సాధింపు ఆలోచనలతో వైకాపా పాలకులు రాత్రిళ్ళు నిద్ర కూడా పోవట్లేదని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. మాజీ ఎంపీ సబ్బం హరి నిర్మాణాల కూల్చివేతలపై హైకోర్టు స్టేటస్ కో విధించినా.. 3 రోజుల్లో భవనాలను తొలగించాలని ప్రభుత్వం రాత్రివేళ నోటీసు పంపటాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. "అధికారంలో ఉన్నవాళ్లు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు రాత్రీపగలూ ఆలోచిస్తారు. అధికార యంత్రాంగాన్ని కూడా ఆ దిశగా ఉత్తేజపరుస్తారు. కానీ వైకాపా పాలకుల తీరు వేరుగా ఉంది. ఇందుకు నిదర్శనమే అర్థరాత్రి అరెస్టులు, చీకట్లో కూల్చివేతలు, పొద్దుపోయాక నోటీసులు" అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కక్ష రాజకీయాల కోసం పాలనను, వ్యవస్థలను భ్రష్టు పట్టించటం రాష్ట్రానికి చేటు తెస్తుందని హితవు పలికారు. న్యాయస్థానాల్లో ఉన్న అంశాలపై ఇలా స్పందించటం వెనక వేధింపులే లక్ష్యంగా కనిపిస్తున్నాయని చంద్రబాబు విమర్శించారు.