రాజ్యసభకు నామినేట్ అయిన లెజెండరీ స్క్రీన్ రైటర్, డైరెక్టర్ విజయేంద్ర ప్రసాద్, అసమాన సంగీత దర్శకుడు ఇళయరాజాలకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఇరువురూ రాజ్యసభకు నామినేట్ కావటం ఎంతో సంతోషాన్నిస్తోందన్నారు. వారి పదవీకాలం విజయవంతంగా సాగాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు.
లోకేశ్ అభినందనలు: రాజ్యసభకు నామినేట్ అయిన కేవీ విజయేంద్ర ప్రసాద్, ఇళయరాజా లకు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అభినందనలు తెలిపారు. తమ అపార ప్రతిభతో ప్రజల్ని మంత్రముగ్ధులను చేసిన ఇద్దరు దిగ్గజాలకు తగిన గుర్తింపు లభించిందని పేర్కొన్నారు. ఇద్దరూ రాజ్యసభకు నామినేట్ అయ్యారని తెలుసుకుని ఎంతో సంతోషించాని అన్నారు.
పెద్దల సభకు నలుగురు ప్రముఖులు: రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు నలుగురు ప్రముఖులను కేంద్రం నామినేట్ చేసింది. దర్శకధీరుడు రాజమౌళి తండ్రి, ప్రముఖ రచయిత వి.విజయేంద్రప్రసాద్, ప్రముఖ సినీ సంగీత దర్శకుడు ఇళయరాజ, పరుగుల రాణి పి.టి. ఉష, వీరేంద్ర హెగ్డే ఆ జాబితాలో ఉన్నారు. ఆయ రంగాలో వీరు చేసిన విశేష కృషిని గుర్తిస్తూ.. కేంద్ర ప్రభుత్వం వి.విజయేంద్రప్రసాద్, ఇళయరాజ, పి.టి. ఉష, వీరేంద్ర హెగ్డేను పెద్దల సభకు ఎంపిక చేసింది.