ఎన్నికలకు ముందు రైతులకిచ్చిన హామీలపై ముఖ్యమంత్రి జగన్ మాట తప్పి మడమ తిప్పారని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. పార్టీ సీనియర్ నాయకులు,నియోజకవర్గ బాధ్యులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న ఆయన..వైకాపా అధికారంలోకి వచ్చి ఒక్కో రైతులు రూ.77,500 ఎగ్గొట్టిందని ఆరోపించారు. రైతు భరోసా పేరుతో 5 ఏళ్లలో రూ.37,500 మాత్రమే ఇస్తున్నారని తెలిపారు. తెదేపా అధికారంలో ఉండిఉంటే అన్నదాత సుఖీభవ, రుణమాఫీ 4, 5 విడతలు కలిపి ఒక్కో రైతుకు రూ. లక్షా 15వేలు వచ్చేదన్నారు. ఎన్నికలకు ముందు విపత్తు సహాయ నిధి రూ.4వేలకోట్లు ఇస్తామని నమ్మించి మోసం చేశారన్నారు.
ఇళ్లు ఇస్తారా? స్వాధీనం చేసుకోమంటారా ?
తెదేపా హయాంలో కట్టిన ఇళ్లను సంక్రాంతి లోపు పేదలకు స్వాధీనం చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. లేకపోతే తెదేపా ఆధ్వర్యంలో చేపట్టే ప్రజా ఉద్యమం ద్వారా డిపాజిట్లు కట్టిన పేదలే గృహ ప్రవేశాలు చేస్తారని హెచ్చరించారు. "కట్టిన ఇళ్లను, డిపాజిట్లు చెల్లించిన పేదలకు ఇవ్వరా?. ఏడాదిన్నరగా పెండింగ్ బిల్లులు ఎందుకని నిలిపేశారో చెప్పాలి. చట్టాలను మీరు ఉల్లంఘిస్తూ... తెదేపా నేతలపై కేసులు పెడుతున్నారు. బీసీలపై ప్రేమ ఉంటే ఆదరణ పనిముట్లు ఎందుకు పంపిణీ చేయట్లేదు. కట్టిన లక్షలాది ఇళ్లు ఎందుకు ఇవ్వడం లేదు. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక ఇళ్లు ఎందుకు మళ్లించారు. బడ్జెట్లో కోతలు విధించటం నమ్మక ద్రోహం కాదా?. నిత్యవసరాలు, విద్యుత్, ఆర్టీసీ, పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెంచేశారు. హారన్ కొడితే జరిమానాలు విధించడం మరో తుగ్లక్ చర్య. సర్వేరాళ్లపై జగన్ రెడ్డి బొమ్మలు ఇంకో తుగ్లక్ చర్య. తుగ్లక్ పాలనతో రాష్ట్రాన్ని అప్రదిష్ఠపాలు చేశారు." అని చంద్రబాబు ధ్వజమెత్తారు.
గెలిపించిన ఎంపీలను కేసుల మాఫీకి వాడుకుంటున్నారు