ఎన్సీఆర్బీ నివేదిక ప్రకారం రాష్ట్రంలో రైతులు, రైతు కూలీల ఆత్మహత్యలు 55 శాతం పెరిగాయంటే, జగన్ పాలనపై అన్నదాతల్లో పెరిగిన నిరాశా నిస్పృహలకు నిదర్శనమని చంద్రబాబు దుయ్యబట్టారు. మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గ తెదేపా నేతలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆదుకునేవాళ్లు లేక రాష్ట్ర రైతులు ఆగమ్యగోచరంలో ఉంటే, బడుగు బలహీన వర్గాల బతుకు దుర్భరంగా మారాయని చంద్రబాబు ధ్వజమెత్తారు.
'వైకాపా నేతల నుంచి తమ భూములు, పంటలను కాపాడుకునేందుకు రైతులు ఆత్మహత్యాయత్నాలకు పాల్పడుతున్నారు. గుంటూరు జిల్లా పోతుమర్రులో పంట కాపాడుకునేందుకు సలీమ్ కత్తితో పొడుచుకుంటే, అసైన్డ్ భూములను కాపాడుకోడానికి ఎస్సీ, ఎస్టీ మహిళలు పురుగుమందు డబ్బాలతో తిరగాల్సి వస్తోంది. భూముల ఆక్రమణ, తోటల నరికివేత, పంటలు దున్నేయడం, బోర్లు ధ్వంసం చేయడం, ఆర్థిక మూలాలు దెబ్బతీయడం వంటి కక్షసాధింపు చర్యలు రాష్ట్ర చరిత్రలో లేవు. వైకాపా నాయకుల కన్నుపడ్డ భూమి గల్లంతే. భూబకాసురుల్లా మారి భూములను మింగేస్తూ, భూరక్ష-భూహక్కు అనటం దయ్యాలు వేదాలు వల్లించటమే' అని చంద్రబాబు విమర్శించారు.
వ్యవసాయ భూమి మట్టిలో కప్పెట్టే సరిహద్దు రాళ్లకు జగన్ రెడ్డి ఫోటోలతో కూడిన గ్రానైట్ రాళ్లు పెట్టడం మరో తుగ్లక్ చర్య. తెదేపా ప్రభుత్వం చేపట్టిన రైతు సంక్షేమ పథకాలన్నీ రద్దు చేశారు. రైతులకింత నమ్మకద్రోహం చేసిన పార్టీని, ప్రభుత్వాన్ని చూడలేదు. నైరాశ్యంలో ఉన్న రైతులు, రైతుకూలీలకు తెదేపా నాయకులు, కార్యకర్తలు అండగా నిలవాలి. ‘రైతుకోసం ఉద్యమాన్ని ఉద్ధృతం చేయాలి. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించి వారిలో మనోధైర్యం పెంచి వైకాపా రైతు వ్యతిరేక చర్యలను ప్రజల్లో ఎండగట్టాలి.
- చంద్రబాబు, తెదేపా అధినేత
ఎన్నికలు ఎప్పుడొచ్చినా శ్రేణులంతా సిద్ధంగా ఉండాలి
ఎన్నికలు ఎప్పుడొచ్చినా తెదేపా శ్రేణులంతా సంసిద్ధంగా ఉండాలని చంద్రబాబు దిశానిర్ధేశం చేశారు. స్వార్థం కోసం రాష్ట్రాన్ని, భావితరాల భవిష్యత్‌ను కాలరాసే చర్యలకు వైకాపా నాయకులు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు. ప్రజా చైతన్యంతోనే అరాచకాలకు అడ్డుకట్ట వేయాలని సూచించారు. 'సమాజం, రాష్ట్రం, భావితరాల భవిష్యత్తే ముఖ్యం. సంక్షోభంలో సరైన నాయకత్వం ఇచ్చి, బాధల్లో ఉండే ప్రజలకు అండగా ఉండేవాళ్లే హీరోలు. వీరోచితంగా పోరాడేవాళ్లకే ప్రజాదరణ ఉంటుంది. వైకాపా దుర్మార్గాలపై రాజీలేని పోరాటం చేస్తూ, ప్రజల్లో చైతన్యం పెంచాలి.' అని చంద్రబాబు కోరారు.