ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తిరుపతి ఉపఎన్నిక వైకాపా పతనానికి నాంది కావాలి: చంద్రబాబు - చంద్రబాబు తాజా కామెంట్స్

తిరుపతి ఉపఎన్నిక విజయంతో వైకాపా దాడులకు అడ్డుకట్ట పడాలని తెదేపా అధినేత చంద్రబాబు ఆ పార్టీ నేతలతో వ్యాఖ్యనించారు. జగన్​ రెడ్డి శిశుపాలుడిని మించిపోయి.., 20 నెలల్లోనే వందలాది తప్పులు చేశారని ఎద్దేవా చేశారు. వైకాపా పతనానికి తిరుపతి ఉపఎన్నికతో నాంది పలకాలన్నారు.

తిరుపతి ఉపఎన్నిక వైకాపా పతనానికి నాంది కావాలి
తిరుపతి ఉపఎన్నిక వైకాపా పతనానికి నాంది కావాలి

By

Published : Jan 19, 2021, 4:22 PM IST

Updated : Jan 19, 2021, 6:50 PM IST

వైకాపా పతనానికి తిరుపతి ఉపఎన్నికతో నాంది పలకాలని తెలుగుదేశం శ్రేణులకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. తిరుపతి నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన.. వైకాపా దాడులు, విధ్వంసాలకు అడ్డుకట్ట వేయాలన్నారు. జగన్ దుర్మార్గాలపై జనవరి 21 నుంచి తిరుపతి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ధర్మపరిరక్షణ యాత్ర నిర్వహించనున్నట్లు తెలిపారు. 10 రోజుల పాటు 700 గ్రామాల్లో జరిగే ఈ యాత్రలో..వైకాపా అరాచకాలపై ప్రజలను చైతన్యపరచాలని దిశానిర్దేశం చేశారు. ఇళ్ల స్థలాల పేరుతో వేల కోట్లు దోపిడీకి వైకాపా నేతలు పాల్పడ్డారన్నారు. తెదేపా హయాంలో కట్టిన ఇళ్లను పేదలకు ఇవ్వలేదని ఆక్షేపించారు. వ్యవసాయానికి మీటర్లు పెట్టడం, ఏటా 6వేల రైతు భరోసాను ఎగ్గొట్టిన తీరును ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ ముస్లిం మైనారిటీలపై దాడుల అంశాలనూ ప్రజా క్షేత్రంలో ఎండగట్టాలని శ్రేణులకు చంద్రబాబు పిలుపునిచ్చారు.

పుణ్యక్షేత్రాలపై దాడులు

తెలుగుదేశం పార్టీ లౌకిక పార్టీ అన్న చంద్రబాబు... తమ హయాంలో ఏ ప్రార్ధనా మందిరంపై దాడి జరగలేదన్నారు. అధికారంలో ఉన్నా లేకున్నా అన్ని మతాలను గౌరవించి ప్రజల మనోభావాలను కాపాడామని చెప్పారు. జగన్ సీఎం అయ్యాక తిరుమల తిరుపతి పవిత్రతకు కళంకం తెచ్చారని ధ్వజమెత్తారు. తితిదేలో ఒక సామాజికవర్గానికి పెద్దపీట వేశారని దుయ్యబట్టారు. కొండపై మద్యం, మాంసం విక్రయాలు, అన్యమత ప్రచారం, బలవంతపు మత మార్పిళ్లను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. అన్ని పుణ్యక్షేత్రాలపైనా దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవుళ్ల రథాలతో పాటు దర్గాలకు నిప్పుపెట్టే కుట్రలకు పాల్పడ్డారని విమర్శించారు. ఎన్​టీఆర్ విగ్రహాల్ని ధ్వంసం చేస్తున్నారన్న ఆయన.. ప్రతి ఒక్కరూ దీన్ని ఖండించాలని పిలుపునిచ్చారు. జగన్ గ్యాంగ్ దుర్మార్గాలపై ఇంటింటి ప్రచారం చేయాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. యువతరమే ప్రచార బాధ్యతల్ని భుజాన వేసుకోవాలని చంద్రబాబు కోరారు.

ప్రాణాలు తీయటం వైకాపాకు నిత్యకృత్యమైంది

ప్రజల ప్రాణాలు తీయడం వైకాపాకు నిత్యకృత్యంగా మారిందని చంద్రబాబు దుయ్యబట్టారు. 20 నెలల్లో 2వేల మంది రైతుల ఆత్మహత్యలు జరిగాయన్నారు. 16మంది తెదేపా కార్యకర్తల హత్య, 1,350చోట్ల భౌతికదాడులు, 400మంది మహిళలపై అఘాయిత్యాలు చేశారన్నారు. రాష్ట్రాన్ని రావణకాష్ఠంలా, ఉన్మాదుల రాజ్యంగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీటెక్ రవి భవిష్యత్‌లో జగన్‌పై పోటీ చేస్తారనే అక్కసుతోనే తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు. ఓ ఎమ్మెల్యే ఏకంగా జిల్లా ఎస్పీని బహిరంగ సభలో బెదిరిస్తే చర్యలు తీసుకోలేదన్నారు. ఓ మంత్రి... ప్రతిపక్షానికి చెందిన నాయకుడిని ఇంటికొచ్చి కొడతాననడం వైకాపా రౌడీ రాజకీయాలకు నిదర్శనమన్నారు. డీజీపీ వల్లే శాంతిభద్రతలు అధ్వానంగా మారాయని విమర్శించారు. పదవుల కోసం వైకాపాతో కుమ్మక్కైన కొందరు పోలీసుల అండ చూసుకునే... క్రిమినల్ గ్యాంగ్స్ రెచ్చిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటన్నింటికీ చెక్‌ పెట్టేందుకు శ్రేణులు సమాయత్తం కావాలని చంద్రబాబు సూచించారు.

ఇదీచదవండి:రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా?: చంద్రబాబు

Last Updated : Jan 19, 2021, 6:50 PM IST

ABOUT THE AUTHOR

...view details