Chandrababu News: జగన్ లూఠీ, దోపిడీ వల్లే.. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతోందని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. వైశ్యులు లేని మంత్రివర్గం.. ఏపీ చరిత్రలో చూడలేదని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. రాజకీయాల్లో వర్గ ద్వేషాలు ఉండకూడదని.. కొన్ని వర్గాలను లక్ష్యం చేసుకోవడం ఎప్పుడూ చూడలేదని మండిపడ్డారు. రాష్ట్రంలో వర్గపోరును జగన్ పెంచి పోషిస్తున్నారని విమర్శించారు. పవన్‌పై కోపంతో ఒక సామాజికవర్గాన్ని, తెదేపాపై కోపంతో మరో వర్గాన్ని, రఘరామకృష్ణంరాజుపై కోపంతో మరో వర్గాన్ని టార్గెట్ చేస్తూ.. కక్ష సాధిస్తున్నారని చంద్రబాబు ఆక్షేపించారు. జగన్‌లో అపరిచితుడు ఉన్నాడని.. జగన్ చెప్పే వాటికి చేసే వాటికి సంబంధం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
వైకాపా.. ఇప్పుడు ఓడిపోతే మళ్లీ జీవితంలో అధికారంలోకి రాదు అనే భయంలోకి జగన్ వెళ్లిపోయారని చంద్రబాబు విమర్శించారు. జగన్ ఫ్రస్టేషన్లోనే భాష మారిందని.. క్యాబినెట్ విస్తరణతో బలహీనుడని తేలిపోయిందని విమర్శించారు. ఒత్తిళ్లతో సగం మందిని క్యాబినెట్లో తిరిగి కొనసాగించారని.. దీంతో బయట తిరుగుబాట్లు మొదలయ్యాయని గుర్తుచేశారు. క్యాబినెట్ విస్తరణ అనంతరం బతిమిలాడుకోవాల్సిన పరిస్థితిని.. రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రికి రాలేదన్నారు. ప్రభుత్వంపై ఈ స్థాయి ప్రజా వ్యతిరేకత చరిత్రలో చూడలేదని ఉద్ఘాటించారు. ప్రభుత్వాలు విఫలం అవ్వడం వేరు.. పాలనపై ఈ స్థాయిలో అసంతృప్తి వేరని చంద్రబాబు తెలిపారు.
1994లోనూ ఇంత వ్యతిరేకత లేదు:తెదేపా అత్యధిక సీట్లు గెలిచిన 1994లో కూడా ప్రజల్లో నాటి ప్రభుత్వంపై ఇంత వ్యతిరేకత లేదన్నారు. జగన్ ప్రభుత్వ విధానాలతో ప్రజల జీవన ప్రమాణాలు దారుణంగా దెబ్బతిన్నాయని మండిపడ్డారు. జగన్ లూఠీ, దోపిడీ వల్లే.. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతోందన్నారు. సంక్షేమం వల్ల ఆర్థిక వ్యవస్థ కుప్పకూలటం అనే కంటే జగన్ లూటీనే అసలు కారణమని చంద్రబాబు పేర్కొన్నారు. జగన్ పథకాల వెనుక ఉన్న లూటీ, ఏం నష్టపోయామో ప్రజలకి తెలుస్తోందన్నారు. ప్రభుత్వానికి ఆదాయం వచ్చే మార్గాలను దెబ్బతీసి సీఎం తన ఆదాయం పెంచుకుంటున్నాడని చంద్రబాబు ఆరోపించారు. మద్యంపై బహిరంగ దోపిడీ, ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం వ్యక్తుల జేబులోకి వెళుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనింగ్, ఇసుకను సంపూర్ణంగా దోచుకుంటున్నారని.. ఆ భారం ప్రజలపైనే పడుతోందని ఆక్షేపించారు. రైతు వర్గంలో ఒక్క ఓటు కూడా ఇక వైకాపా పడే అవకాశం లేదని చంద్రబాబు తెల్చిచెప్పారు.
ప్రతి నెలా రెండు జిల్లాల్లో పర్యటన
పార్టీ కేడర్‌ను ఇప్పటి నుంచే ఎన్నికలకు సంసిద్ధం చేసేందుకు, వివిధ ఛార్జీల పెంపు, పన్నుల భారాలతో ప్రజలు పడుతున్న అవస్థలపై పోరాడేందుకు తెదేపా అధినేత చంద్రబాబు విస్తృతంగా జిల్లాల్లో పర్యటించనున్నారు. బుధవారం తన పుట్టినరోజుని ప్రజల మధ్యే నిర్వహించుకోవడం ద్వారా ప్రజాప్రస్థానానికి ఆయన శ్రీకారం చుట్టబోతున్నారు. మే మొదటి వారం నుంచి పూర్తి స్థాయిలో ఆయన పర్యటనలు మొదలుకానున్నాయి. పార్టీ నిర్వహిస్తున్న ‘బాదుడే బాదుడు’ కార్యక్రమంలో మే నెలలో ఆయన పాల్గొంటారు. పార్టీ మహానాడు తర్వాత ప్రతి నెలా రెండు జిల్లాలు చొప్పున ఏడాది పాటు రాష్ట్రమంతా పర్యటించేలా ఆయన ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు. రోడ్డు షోల ద్వారా ప్రజల్లోకి వెళ్లాలా? గ్రామ సభలు నిర్వహించాలా? వంటి అంశాలపై పార్టీ నాయకులతో చర్చించాక ఒక నిర్ణయం తీసుకోనున్నారు.