ప్రజాస్వామ్యంలో ఇలాంటి చర్యలు ఖండిస్తున్నాం: చంద్రబాబు
CBN COMMENTS ON LATEST POLITICS : విశాఖలో పవన్‌పై రాష్ట్ర ప్రభుత్వం చేసిన విధానం సరికాదని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి చర్యలు ఖండిస్తున్నామన్నారు. విజయవాడలో పవన్‌ను కలిసి సంఘీభావం తెలిపారు. అనంతరం చంద్రబాబు, పవన్‌లు ఇద్దరూ కలిసి మీడియాతో మాట్లాడారు. విశాఖలో తలపెట్టిన కార్యక్రమం కోసమే అక్కడకు వెళ్లారని.. ఒకేసారి రెండు పార్టీల కార్యక్రమం జరిగితే పోలీసులు తగిన ఏర్పాట్లు చేస్తారన్నారు. కానీ ఆ కార్యక్రమం జరగకుండా జనసేన కార్యకర్తలపై దాడి చేసి.. తిరిగి వాళ్లపైనే కేసులు పెట్టారని చంద్రబాబు మండిపడ్డారు. గతంలో నాపై దాడులు చేసి.. నాపైనే కేసులు పెట్టారన్నారు.. ఇప్పుడు విశాఖలో కావాలనే పవన్‌ను ఇబ్బందులు పెట్టారని.. హోటల్‌లో ఉన్నప్పుడు భయంకరమైన వాతావరణం సృష్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ విశాఖలో ఉంటే లా అండ్ ఆర్డర్ సమస్య ఎందుకు వస్తుందని ప్రశ్నించారు.
వైకాపా లాంటి పార్టీని ఎక్కడా చూడలేదు : పార్టీల అధినేతలకే రక్షణ లేకుంటే సామాన్యులకు ఉంటుందా అని చంద్రబాబు ప్రశ్నించారు. వ్యక్తిత్వ హననం చేసేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. 40 ఏళ్లుగా ఎప్పుడూ చూడని రాజకీయాలు చూస్తున్నామన్న చంద్రబాబు.. వైకాపా ప్రభుత్వ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. వైకాపా లాంటి నీచమైన పార్టీని జీవితంలో ఎప్పుడూ చూడలేదని మండిపడ్డారు. మా పార్టీపై దాడి చేసిన వారిని ఇప్పటివరకు అరెస్టు చేయలేదని.. ముందుగా రాజకీయ పార్టీల మనుగడను కాపాడుకుందామని పిలుపునిచ్చారు.
ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి : మీడియా సమావేశం పెట్టడమే పవన్ కల్యాణ్ చేసిన తప్పా? అని చంద్రబాబు నిలదీశారు. ఈ ప్రభుత్వ వేధింపులపై అన్ని పార్టీలతో మాట్లాడతామని.. కొందరు పోలీసు అధికారులు దారుణంగా ప్రవర్తిస్తున్నారని ఆగ్రహించారు. అడుగడుగునా ఆంక్షలు, నిర్బంధాలు పెట్టడం పోలీసులు ఆపాలని.. ముందుగా రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. అన్ని పార్టీలు, ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాలతో మాట్లాడతామని ప్రకటించారు. ఇంట్లో నుంచి బయటకు రావాలంటే ప్రజలు భయపడుతున్నారని.. ప్రజాస్వామ్య పరిరక్షణ పోరాటం చేస్తామని తెలిపారు.
పవన్ కల్యాణ్‌కు తిట్లు తినే అలవాటు లేదు : బయటకు వచ్చి ధైర్యంగా మాట్లాడే స్వేచ్ఛ ఎవరికైనా ఉందా? అని ప్రశ్నించారు. ఎక్కడ చూసినా వైకాపా నేతల కబ్జాలే కనిపిస్తున్నాయని.. ప్రజాసమస్యల గురించి మాట్లాడకుండా అడ్డంకులు కల్పిస్తున్నారని ఆగ్రహించారు. సమస్యలు ధైర్యంగా చెప్పుకునే స్వేచ్ఛ ప్రతి ఒక్కరికీ ఉండాలని హితవు పలికారు. ప్రజాప్రతినిధిని అవమానిస్తే ప్రజలను అవమానించినట్లేనని చంద్రబాబు తెలిపారు. ప్రతిపక్ష నేతలను విమర్శించి పబ్బం గడుపుకుంటున్నారని మండిపడ్డారు. పవన్ కల్యాణ్‌ను తిట్టిన తిట్లు చూసి నేనే భరించలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్‌కు తిట్లు తినే అలవాటు లేదని.. కానీ రాజకీయాల్లోకి వచ్చాక పవన్ తిట్లు తింటున్నారని తెలిపారు. ఈ ప్రభుత్వ చర్యలతో పవన్ కోపం కట్టలు తెంచుకుందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యహితులంతా ముందు చేతులు కలపాలని.. కలిసివచ్చే పార్టీలతో మాట్లాడి.. కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు.
ఇవీ చదవండి: