కండిషన్ బెయిల్‌పై ఉన్న వ్యక్తి న్యాయవ్యవస్థను విమర్శించడం కంటే దివాలాకోరుతనం మరొకటి లేదని తెదేపా జాతీయాధ్యక్షుడు చంద్రబాబు ధ్వజమెత్తారు. ‘వైకాపా ప్రభుత్వ వైఫల్యాల వల్లే ఎస్సీ ఎంపీ బల్లి దుర్గాప్రసాదరావు కరోనాకు బలై ప్రాణాలు కోల్పోతే.. పార్లమెంటులో సంతాప తీర్మానం పెట్టినప్పుడు వైకాపా సభ్యులు సభను బహిష్కరించి బయటకొచ్చి ధర్నా చేయడం నీచం. చనిపోయిన ఎంపీకి ఇచ్చే గౌరవం ఇదేనా?’ అని ప్రశ్నించారు. ‘ఎస్సీలపై దాడులను ఖండించడానికే కాదు, చనిపోయిన ఎస్సీ ఎంపీ కుటుంబాన్ని పరామర్శించడానికి కూడా సీఎం జగన్ ఇంట్లో నుంచి బయటకు రాలేదు..’ అని విమర్శించారు.
గురువారం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ ఆన్‌లైన్ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. చనిపోయిన సభ్యుడిపై లోక్‌సభలో తీర్మానం పెడితే సొంత పార్టీ వాళ్లే హాజరు కాకపోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. కరోనా నియంత్రణ, ఏపీకి ప్రత్యేక హోదా, విభజన చట్టంలో అంశాలు, రాష్ట్ర ప్రయోజనాలపై లోక్‌సభలో మాట్లాడని వైకాపా ఎంపీలు.. తెదేపాపై విమర్శలు చేయడం రాజకీయ కక్ష సాధింపునకు పరాకాష్ఠ అని ఆగ్రహం వెలిబుచ్చారు. జీఎస్టీ నిధుల కోసం ప్రతిపక్ష ఎంపీలంతా ధర్నా చేస్తుంటే.. అందులో వైకాపా ఎంపీలు పాల్గొనకపోవడమే రాష్ట్ర ప్రయోజనాలపై వారి నిర్లక్ష్యానికి నిదర్శనమని పేర్కొన్నారు.
న్యాయవ్యవస్థను లక్ష్యం చేయడమే
కొత్త రాష్ట్రం, కొత్త రాజధానిలో నివాసం ఏర్పాటు చేసుకుంటే శరవేగంతో అభివృద్ధి చెందుతుందనే 372 మంది అఖిల భారత సర్వీసు అధికారులకు ఇళ్లస్థలాలు ఇచ్చాం, అందులో ప్రస్తుత సీఎంవోలోని ఉన్నతాధికారులూ ఉన్నారని చంద్రబాబు వివరించారు. ‘ప్రభుత్వ ఉద్యోగులు, న్యాయసేవా అధికారులు, శాఖాధిపతులు, ఉన్నతాధికారులకు ఇచ్చినప్పుడే న్యాయమూర్తులకూ ఒక విధానం ప్రకారం కేటాయించాం. ఇతర వర్గాలకు ఇచ్చిన ఇళ్ల స్థలాల గురించి కాకుండా.. జడ్జిల గురించి దుష్ప్రచారం చేయడమంటే న్యాయవ్యవస్థను టార్గెట్ చేయడమే’ అని దుయ్యబట్టారు. తప్పులు చేసిన వైకాపా.. న్యాయస్థానాలపై నిందలు వేస్తూ దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.
వైకాపా పాలనలో అవినీతిపై సీబీఐ దర్యాప్తు కోరాలి
16 నెలల వైకాపా పాలనలో అవినీతి కుంభకోణాలపై కూడా సీబీఐ దర్యాప్తు కోరాలని చంద్రబాబు డిమాండు చేశారు. ‘విశాఖలో ఆక్రమించిన భూములు, ఆరోగ్యసేతు యాప్ అభివృద్ధి చేసిన వ్యక్తి భూమి కబ్జా, 6,116 ఎకరాల భూసేకరణ, వేలాది ఎకరాల భూ ఆక్రమణ, ఇళ్ల స్థలాల భూసేకరణలో జరిగిన రూ.4వేల కోట్ల అవినీతి, దేశంలో ఎక్కడా లేని నాసిరకం మద్యం అమ్మకం ద్వారా ప్రజారోగ్యాన్ని దెబ్బతీయడం, జే ట్యాక్స్ వసూలు, ముగ్గురాయి, లేటరైట్, ఇసుక తవ్వకాల్లో మైనింగ్ మాఫియాపై విచారణ చేయించాలి’ అని డిమాండ్ చేశారు. అంతర్వేది సహా రథాలకు నిప్పు, విగ్రహాల ధ్వంసం తదితర ఘటనల పైనా సీబీఐ విచారణ చేయించాలని కోరారు. ‘ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నిర్మించిన లక్షలాది ఇళ్లను పేదలకు ఇవ్వకుండా వేధించడం దుర్మార్గం, బిల్లులు కూడా చెల్లించకుండా పేద కుటుంబాలను అప్పుల పాలు చేయడం దారుణం’ అని చంద్రబాబు ధ్వజమెత్తారు. కరోనాపై సభలో చర్చ జరుగుతుంటే దాన్నొదిలేసి కోర్టులు, అమరావతిపై సందర్భం లేకుండా మాట్లాడటాన్ని సభలోనే ఖండించామని, రికార్డుల నుంచి తొలగించాలని పట్టుబట్టినట్లు తెదేపా ఎంపీలు చంద్రబాబు దృష్టికి తెచ్చారు. సమావేశంలో తెదేపా ఎంపీలు గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు, కేశినేని నాని, కనకమేడల రవీంద్రకుమార్ పాల్గొన్నారు.
ఇదీ చదవండి:ప్రజాప్రతినిధులు అధికారానికి తాత్కాలిక ధర్మకర్తలే :హైకోర్టు