ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రజల ఆస్తులు కొట్టేసేందుకు జగన్ ప్రణాళికలు: చంద్రబాబు - వైకాపా ప్రభుత్వంపై చంద్రబాబు కామెంట్స్

గాలి, నీరు, భూమి దేనినీ వదలకుండా పంచ భూతాలనూ ముఖ్యమంత్రి జగన్ మింగేస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు ఆక్షేపించారు. అన్ని జిల్లాల్లో ప్రజల ఆస్తులు కొట్టేసేందుకు జగన్ ప్రణాళికలు వేస్తున్నారని ఆరోపించారు. అందులో భాగంగానే భూ సర్వే హడావుడిగా ప్రారంభించారని ధ్వజమెత్తారు. వైకాపా దుర్మార్గాలపై తమ పార్టీ తరపున పోరాటాన్ని తీవ్రతరం చేస్తామన్నారు.

ప్రజల ఆస్తులు కొట్టేసేందుకు జగన్ ప్రణాళికలు
ప్రజల ఆస్తులు కొట్టేసేందుకు జగన్ ప్రణాళికలు

By

Published : Dec 22, 2020, 6:23 PM IST

Updated : Dec 22, 2020, 10:40 PM IST

అన్ని జిల్లాల్లో ప్రజల ఆస్తులు కొట్టేసేందుకు జగన్ ప్రణాళికలు రచిస్తున్నారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు విమర్శించారు. చుక్కల, అసైన్డ్, సొసైటీ ఇలా 6 రకాల భూమలపై జగన్ కన్నుపడిందని దుయ్యబట్టారు. అందుకే హడావుడిగా భూసర్వే ప్రారంభించారని ధ్వజమెత్తారు. పార్టీ సీనియర్ నేతలు, ప్రజాప్రతినిధులు, 175 నియోజకవర్గాల ఇంచార్జ్​లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన...ప్రజలు తమ ఆస్తులు, భూములను ఏరోజుకారోజు సరిచూసుకునే పరిస్థితి నెలకొందని ఎద్దేవా చేశారు.

"జగన్ అండతో రాష్ట్రవ్యాప్తంగా వైకాపా ల్యాండ్ మాఫియా పేట్రేగిపోతోంది. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు వైకాపా నేతలు వందల కోట్ల భూకుంభకోణాలకు పాల్పడ్డారు. ఇళ్లస్థలాలకు భూసేకరణ పేరుతో 4 వేల కోట్ల కుంభకోణం చేశారు. ఆవభూములు, మడ అడవులు, 10-15 అడుగుల్లోతు ముంపు భూముల్లో స్థలాలు ఇచ్చి, వాటికి మెరక పేరుతో 2 వేల కోట్ల నరేగా నిధులు గోల్ మాల్ చేశారు. వైకాపా కార్యకర్తల ఆస్తులకే రక్షణ లేదనటానికి గుంటూరు జిల్లా భట్టిప్రోలులో వైకాపా కార్యకర్త ఆత్మహత్య సంఘటనే ఉదాహరణ. రాష్ట్రంలో గంటకో అత్యాచారం, పూటకో హత్య జరుగుతుంటే ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేదు. గతంలో అత్యాచార ఘటన జరిగితే నైతిక బాధ్యత వహించి ప్రభుత్వ పెద్దలు రాజీనామా చేసిన సందర్భాలు, రద్దైన ప్రభుత్వాలు ఉన్నాయి. ఇతర ప్రాంతాలకు చెందిన న్యాయమూర్తులు సైతం రాష్ట్ర పరిస్థితులపై ఆవేదన చెందుతుంటే వైకాపా నేతల్లో పరివర్తన, పశ్చాత్తాపం మచ్చుకు కూడా లేదు." - చంద్రబాబు

సొంత పార్టీ నేతలు తిరగబడతున్నారు

ప్రతీ కార్యకర్త ప్రజాసమస్యలపై గళం విప్పాలని చంద్రబాబు శ్రేణులకు దిశానిర్ధేశం చేశారు. వైకాపా దుర్మార్గాలపై తెదేపా పోరాటాన్ని తీవ్రతరం చేసి ప్రజలకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. అన్ని వర్గాల ప్రజలు జగన్ పాలనతో విసుగెత్తిపోయారన్న ఆయన... సొంత పార్టీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ప్రభుత్వ పనితీరును ఎండగడుతుండటమే జగన్ చెత్త పాలనకు నిదర్శనమన్నారు. తెదేపా ప్రభుత్వం పట్టణాల్లో 2 సెంట్లు, , గ్రామాల్లో 3 సెంట్లు ఇళ్ల స్థలాలకు ఇస్తే, సగం కోతపెట్టి సెంటు, సెంటున్నర స్థలం ఇస్తామనటాన్ని ప్రజలు నిలదీయాలన్నారు. గత 20 నెలల ఉన్మాది పాలనలో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను తీవ్ర వేధింపులకు గురిచేశారని ఆక్షేపించారు. ఉచితంగా దొరికే ఇసుకకు ధర నిర్ణయించి ప్రజల్ని దోచుకుంటున్నారన్నారు. ఇసుక, మద్యం వైకాపా నాయకుల ఆదాయవనరులయ్యాయని విమర్శించారు. ప్రజల సొమ్ముతో కొనుగోలు చేసిన పోలీసు వాహనాలకు వైకాపా రంగులేయటం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వ ఉద్యోగులో, వైకాపా కార్యకర్తలో అర్థంకాని విధంగా కొందరి పోలీసుల తీరుందని దుయ్యబట్టారు.

మత విద్యేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం

మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నాల్లో భాగంగానే దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని చంద్రబాబు ఆరోపించారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ ఎరుగని దుర్ఘటనలకు జె-గ్యాంగ్ పాల్పడుతోందన్నారు. బీసీ సభలో చనిపోయిన వ్యక్తి ఘటనను తప్పుదోవ పట్టించి పోస్టుమార్టం నివేదిక కూడా బయటపెట్టకపోగా...అస్వస్థతకు గురైన వారు పూర్తిగా కోలుకోకుండానే హడావుడిగా ఇళ్లకు పంపాల్సిన అవసరం ఏమొచ్చిందని నిలదీశారు. గతంలో వైఎస్ వివేకానందరెడ్డి హత్యను ఇలాగే తప్పుదోవ పట్టించారని ఆరోపించారు.

గిరిజనులకు రక్షణ లేదు

రంపచోడవరం గిరిజనులతో వీడియో కాన్ఫరెన్స్​లో మాట్లాడిన చంద్రబాబు..రాష్ట్రంలో గిరిజనులపై తరచూ దాడులు జరుగుతున్నందున వారి భద్రత ప్రశ్నార్ధకంగా మారిందన్నారు. గిరిజన సంక్షేమాన్ని అటకెక్కించి వారి ఉద్యోగాలకు గండికొట్టడంతో పాటు విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ దోపిడీకి మళ్లీ తెరలేపారని దుయ్యబట్టారు. ఎస్టీలకు తెదేపా ప్రభుత్వం అమలు చేసిన అనేక సంక్షేమ పథకాలను రద్దు చేయటంతోపాటు వారి హక్కులను కాలరాస్తున్నారని విమర్శించారు. పోలవరం ముంపు ప్రాంతాలకు జరిగే నష్టాన్ని ప్రభుత్వమే భర్తీ చేయాలని తేల్చిచెప్పారు.

తెదేపా ఓపికకూ ఓ హద్దు ఉంటుంది

"తెదేపా ఓపికకు ఓ హద్దు ఉంటుంది. మంత్రులు, వైకాపా నేతల వ్యాఖ్యలకు ధీటుగా ప్రతి దాడి చేయాల్సిన సమయం వచ్చింది. తెదేపా జోలికొస్తే సహించేందుకు సిద్ధంగా లేమనే సంకేతాలివ్వాలి. జగన్ తన సామాజికవర్గానికి చెందిన నలుగురు వ్యక్తులకు రాష్ట్రాన్ని ధారాదత్తం చేశారు. రూ.లక్షన్నర కోట్ల అప్పులు చేసి ఏం అభివృద్ధి చేశారో చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు. గేదల షెడ్డు, మోటారు పంపు, పిట్టగోడలకు వైకాపా నేతలు చేసే ప్రారంభోత్సవాలు చూసి పక్క రాష్ట్రాలు నవ్వుకుంటున్నాయి." -అచ్చెన్నాయుడు, తెదేపా రాష్ట్ర అధ్యక్షులు

ఇదీచదవండి

పొలం కబ్జాకు వైకాపా నేతల యత్నం...కత్తితో పొడుచుకున్న కౌలు రైతు !

Last Updated : Dec 22, 2020, 10:40 PM IST

ABOUT THE AUTHOR

...view details