CBN Comments on early elections: ముందస్తు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు తెదేపా అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. పార్టీ గ్రామ, మండల కమిటీలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు.. 2024కు ముందుగా ఎన్నికలు వచ్చినా నేతలు సిద్ధంగా ఉండాలన్నారు. ప్రభుత్వాన్ని ఎంతోకాలం నడపలేమని సీఎం జగన్‌కు అర్థమైందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు బూటకమని ప్రజలకు తెలుస్తోందని చెప్పారు.
కష్టాల్లో ఉన్న రాష్ట్ర ప్రజలు తెదేపాపైనే ఆశలు పెట్టుకున్నారన్న చంద్రబాబు.. గడపగడపలో వైకాపా నేతల నిలదీతలే అందుకు నిదర్శనమన్నారు. వైకాపా ప్రభుత్వ హయాంలో ప్రజలు తీవ్ర కష్టాలపాలయ్యారని చంద్రబాబు ఆక్షేపించారు. తన పర్యటనల్లో ప్రజల నుంచి వస్తున్న స్పందనను నేతలతో పంచుకున్న ఆయన.. నాయకులు అనేవారు నిత్యం ప్రజలకు దగ్గరగా ఉండాలని అన్నారు. జగన్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత అన్ని వర్గాల్లోనూ, అన్ని ప్రాంతాల్లోనూ స్పష్టంగా కనిపిస్తోందని చెప్పారు.