ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

చెన్నుపాటిపై దాడి కేసులో పోలీసులపై చంద్రబాబు ఆగ్రహం.. ఎఫ్​ఐఆర్​లను దగ్ధం చేసిన నేతలు - Chandrababu on Chennupati Case

Chennupati Gandhi Case: చెన్నుపాటి గాంధీపై దాడి కేసులో పోలీసుల తీరుపై తెదేపా అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడి చేసిన వారిపై హత్యాయత్నం కేసు పెట్టకపోవడాన్ని తీవ్రంగా ఖండించారు. పోలీసుల తీరేంటో మరోసారి రుజువైందని దుయ్యబట్టారు. హత్యాయత్నం కేసు పెట్టకపోవడంపై ఏసీపీ ఖాదర్​ బాషా స్పందించారు. న్యాయ సలహా మేరకు ఆ కేసు పెట్టలేదని వివరించారు. రిమాండ్​ రిపోర్టు సమర్పించిన తీరుపై తెదేపా నేతలు మండిపడ్డారు. విజయవాడ పోలీస్​స్టేషన్​ను ముట్టడించారు. పీఎస్​ ఎదుటు ఎఫ్​ఐఆర్​ కాపీలను దగ్ధం చేశారు.

chennupati
చెన్నుపాటి కేసు

By

Published : Sep 8, 2022, 4:38 PM IST

Updated : Sep 8, 2022, 9:27 PM IST

Chandrababu on Chennupati Case: కన్ను పొడిచిన నిందితులకు స్టేషన్ బెయిల్ ఇచ్చి.. నినాదాలు చేసిన వారిపై హత్యాయత్నం కేసు పెట్టిన పోలీసులు మరోసారి తామేంటో,.. తమ శాఖ తీరేంటో,.. తాము ఎటువైపో స్పష్టంగా చెప్పారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. కుప్పంలో సాధారణ నిరసనలు చేపట్టిన వారిపై హత్యాయత్నం సెక్షన్ పెట్టి రిమాండ్​కు పంపిన పోలీసులు... విజయవాడలో దాడి చేసి కన్ను పోగొట్టిన నిందితులకు మాత్రం స్టేషన్ బెయిల్ ఇచ్చి ఇంటికి పంపడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఈ రెండు ఘటనల్లో ఖాకీల తీరు.. పోలీసు శాఖ ప్రతిష్ఠకే మాయని మచ్చని దుయ్యబట్టారు. ప్రభుత్వం కోసం పోలీసులు మరీ ఇంతగా సాగిలపడటాన్ని ప్రజలు ఎవరూ ఆమోదించరన్నారు. ఏపీ పోలీస్ అనే బ్రాండ్‌ సర్వనాశనం కావడానికి, ప్రజలకు పోలీసులపై నమ్మకం పోవడానికి ఈ ఘటనలే ఉదాహరణ అని మండిపడ్డారు. ప్రజల సొమ్ముతో జీతాలు తీసుకునేది నిందితులను రక్షించేందుకు కాదని... చట్టప్రకారం పని చేసేందుకనే విషయం గుర్తించాలని హితవు పలికారు.

ACP on Chennupati Case: న్యాయసలహా తీసుకునే ఆ కేసు పెట్టలేదు.. చెన్నుపాటి గాంధీ కేసుపై విజయవాడ సెంట్రల్‌ ఏసీపీ ఖాదర్‌ బాషా పొంతనలేని సమాధానం చెప్పారు. పటమట పోలీస్‌స్టేషన్‌ వద్ద తెదేపా నేతల ఆందోళన అనంతరం కేసుకు సంబంధించిన వివరాలను ఆయన మీడియాకు వివరించారు. బాధితుడి ఫిర్యాదుతో పాటు, ఆస్పత్రి ఇచ్చిన నివేదికలో మారణాయుధంతో దాడి జరిగిందని ఉన్నప్పటికీ.. న్యాయ సలహా తీసుకునే హత్యాయత్నం సెక్షన్ పెట్టలేదని అన్నారు. ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రితో పాటు ప్రాథమిక చికిత్స చేసిన సూరపనేని ఆస్పత్రి కూడా కన్ను పోయే ప్రమాదం ఉందనే నివేదిక ఇచ్చిందని ఏసీపీ తెలిపారు. గాంధీకి శస్త్ర చికిత్సలు ఇంకా కొనసాగుతున్నందున తుది వైద్య నివేదికను కోర్టు ముందు పెట్టలేదన్నారు. తుది వైద్య నివేదిక వచ్చేవరకు సున్నితమైన అంశంలో నిందితుల్ని కోర్టు ముందు పెట్టకుండా ఉండలేమన్నారు. కేసు ఇంకా విచారణ దశలో ఉంది కాబట్టి.. ఇంతకంటే ఏం సమాధానం చెప్పలేమంటూనే... ఎఫ్ఐఆర్ ఆధారంగానే ముందుకెళ్తున్నామని ఖాదర్‌బాషా తెలిపారు.

ఉద్రిక్తత: విజయవాడ పటమట పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. తెలుగుదేశం నేతలు నల్ల బ్యాడ్జీలు పెట్టుకుని ఒక్కసారిగా పోలీస్ స్టేషన్​ను చుట్టుముట్టారు. తెదేపా నేత చెన్నుపాటి గాంధీపై హత్యాయత్నం జరిగితే.. పోలీసులు కేసును నీరుగార్చుతున్నారంటూ నేతలు ఆందోళన చేపట్టారు. చెన్నుపాటి గాంధీపై జరిగిన హత్యాయత్నంలో గాయం నివేదిక లేకుండా పోలీసులు కోర్టుకు రిమాండ్ రిపోర్టు సమర్పించిన తీరును నిరసిస్తూ ఆందోళన చేశారు. పోలీస్‌ ఎఫ్ఐఆర్ కాపీలు, వైద్యుల నివేదికలు పట్టుకుని పోలీస్ స్టేషన్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. నేతలు విజయవాడ తెదేపా కార్యాలయం నుంచి పటమట పోలీస్ స్టేషన్ వరకు కాలినడకన ర్యాలీగా నిరసన తెలుపుతూ వెళ్లారు. పోలీస్ స్టేషన్ వద్ద ఎఫ్ఐఆర్ కాపీలు తగలపెట్టారు. పదునైన మెటల్‌తో దాడి చేయటం వల్లే కంటికి గాయమైందని వైద్యులు నివేదిక ఇచ్చినా... పోలీసులు నిందితుల్ని కాపాడేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. వైకాపా నేతల్ని కాపాడేందుకు కేసును నీరుగారుస్తున్న పోలీసులపై ప్రైవేటు కేసులు వేస్తామని నేతలు హెచ్చరించారు.

పోలీస్​స్టేషన్ల వల్ల ఉపయోగంలేదనే: పోలీసులకు ఎన్ని ఫిర్యాదులు ఇస్తున్నా అవి బుట్టదాఖలవుతున్నాయని తెదేపా నేతలు దుయ్యబట్టారు. ఇక పోలీస్ స్టేషన్ల వల్ల ఉపయోగం లేదనే ఎఫ్ఐఆర్​లు తగలపెడుతున్నామన్నారు. చెన్నుపాటి గాంధీపై జరిగిన హత్యాయత్నంలో గాయం నివేదిక లేకుండా పోలీసులు... కోర్టుకు రిమాండ్ రిపోర్టు సమర్పించిన తీరును నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, పార్టీ సీనియర్ నేత, మండలి బుద్ధప్రసాద్, తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర, వర్ల రామయ్య, తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న, పలువురు పార్టీ నేతలు నిరసనలో పాల్గొన్నారు. ఐపీఎస్ అధికారులు జగన్ పీనల్ కోడ్ అమలు చేస్తుండటం దుర్మార్గమని మండిపడ్డారు. ప్రజల పక్షాన తామే పోరాడి తప్పు చేసిన పోలీసులకు శిక్షపడేలా చేస్తామని హెచ్చరించారు. పోలీస్ స్టేషన్లు... జగన్ స్టేషన్లుగా మారిపోయాయని విమర్శించారు. నిందితుల్ని కాపాడుతున్నామనే సంకేతాలు పోలీసులు... ప్రజలకు పంపుతున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని జగన్​ రెడ్డి... పిశాచి స్వామ్యంగా మార్చేశారని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ఎస్​ఐపై హైకోర్టులో ప్రైవేటు కేసు వేస్తున్నామని నేతలు తెలిపారు.

చెన్నుపాటిపై దాడి కేసు

ఇవీ చదవండి:

Last Updated : Sep 8, 2022, 9:27 PM IST

ABOUT THE AUTHOR

...view details