ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'తిరుపతి రుయా ఆస్పత్రి ఘటన... వైకాపా ప్రభుత్వ వైఫల్యమే'

Chandrababu: తిరుపతి రుయా ఆస్పత్రి ఘటనపై తెదేపా అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బాలుడి మృతదేహాన్ని బైక్‌పై తరలించడం దారుణమని.. ఇది ప్రభుత్వ వైఫల్యమే అని మండిపడ్డారు. రుయా ఘటన వైద్యశాఖ దుస్థితికి అద్దం పడుతోందని దుయ్యబట్టారు.

Ruya hospital incident in Tirupati
రుయా ఆస్పత్రి ఘటనపై చంద్రబాబు, లోకేశ్​

By

Published : Apr 26, 2022, 1:10 PM IST

Updated : Apr 26, 2022, 10:28 PM IST

Chandrababu: తిరుపతి రుయా ఆసుపత్రి నుంచి బాలుడి మృత దేహాన్ని తండ్రి బైక్​పై తరలించిన ఘటనపై తెదేపా అధినేత చంద్రబాబు తీవ్ర అవేదన వ్యక్తం చేశారు. అన్నమయ్య జిల్లా చిట్వేలుకు చెందిన బాలుడి మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రి నుంచి బైక్​పై తరలించాల్సి రావడం ప్రభుత్వ వైఫల్యమేనని మండిపడ్డారు. కొడుకు మృతదేహాన్ని 90 కిలోమీటర్లు బైక్​పై తీసుకువెళ్లిన ఘటన రాష్ట్రంలో ఆరోగ్య రంగం దుస్థితిని అద్దం పడుతోందని ధ్వజమెత్తారు. ఘటనకు సంబంధించిన వీడియోను ట్వీట్​కు జత చేశారు.

Lokesh: తిరుపతి రుయా ఆసుపత్రిలో జరిగిన ఘటనకు వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరే కారణమంటూ తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ విమర్శించారు. జగన్‌ చేతకాని పాలన కారణంగా అనారోగ్యంతో మరణించిన కొడుకు మృతదేహాన్ని తండ్రి 90 కిలోమీటర్లు బైక్‌పై తీసుకెళ్లాల్సిన దుస్థితి వచ్చిందన్నారు. తెదేపా హయాంలో పార్థివదేహాన్ని ఉచితంగా తరలించే మహాప్రస్థానం రవాణా వాహనాలను ఏర్పాటు చేసిందని లోకేశ్‌ గుర్తుచేశారు. మహాప్రస్థానం వాహనాలను నిర్వీర్యం చేయడం కారణంగానే ప్రైవేటు అంబులెన్సుల దందా పెరిగిందన్నారు. ప్రైవేటు అంబులెన్సుల ధరలు తట్టుకోలేకే... ఆ తండ్రికి బైక్‌పై తీసుకెళ్లాల్సిన కష్టం వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా ? అని నిలదీశారు. ఆసుపత్రుల్లో అమానవీయ ఘటనలు చోటు చేసుంటున్నాయని అన్నారు. మొన్న విజయవాడ ఆసుపత్రిలో యువతిపై సాముహిక అత్యాచారం... నేడు రుయా ఘటన జరిగిందన్నారు. ఇకనైనా సీఎం జగన్‌ నిద్రలేచి ఆసుపత్రుల్లో వసతులను మెరుగుపరచాలన్నారు. రుయా ఆస్పత్రి ఘటన బాధితుడిని లోకేశ్‌ ఫోన్​లో పరామర్శించారు. బాలుడి తండ్రికి వీడియా కాల్ ద్వారా ధైర్యం చెప్పారు. ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ.. బాలుడి తండ్రిని ఓదార్చారు.

సంబధిత కథనం:తిరుపతిలో అమానవీయం..మృతదేహాన్ని తరలించకుండా అడ్డుకున్న అంబులెన్స్​ సిబ్బంది

Last Updated : Apr 26, 2022, 10:28 PM IST

ABOUT THE AUTHOR

...view details