ఆంధ్రప్రదేశ్

andhra pradesh

తెదేపానే కాదు.. ఏపీని టార్గెట్ చేశారు: చంద్రబాబు

By

Published : Feb 22, 2020, 6:32 PM IST

తెదేపా, తనపై ఎంత కక్ష ఉందో చెప్పడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ మరో ఉదాహరణ అని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ఇదేమీ కొత్తకాదన్న ఆయన 9 నెలల్లో 3 సిట్​లు, అయిదారు కమిటీలు వేసి తెలుగుదేశం పార్టీని కాదు.... ఏకంగా ఏపీనే టార్గెట్ చేశారని విమర్శించారు.

chandrababu about sit
chandrababu about sit

రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్​పై చంద్రబాబు స్పందించారు. భావితరాలకు తీరని నష్టం చేస్తున్నారని ట్విట్టర్​లో ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వస్తూనే తవ్వండి, తవ్వండి అన్నారు...తవ్వితే సన్మానాలు చేస్తాం, అవార్డులు ఇస్తాం ప్లీజ్ అంటూ అధికారులను బతిమిలాడుకున్నారని ఆరోపించారు. 8 నెలల క్రితమే మంత్రివర్గ ఉపసంఘం వేసి... రాష్ట్రాభివృద్ధికి అడ్డుపడటం, పెట్టుబడులను తరిమేయడం తప్ప ఏం సాధించారని చంద్రబాబు ప్రశ్నించారు. కొత్తగా సిట్ ఏర్పాటుతో కక్షసాధింపు తప్ప ప్రజలకు కలిగే ప్రయోజనమేంటని నిలదీశారు. వైఎస్ హయాంలో తన మీద 26 విచారణలు, సీబీసీఐడీతో విచారణ చేయించినా... ఏమీ నిరూపించలేకపోయారని గుర్తు చేశారు. ఇప్పుడూ అదే జరుగుతుందని స్పష్టం చేశారు. తెదేపా నేతలపై కక్ష సాధించడమే వైకాపా అజెండా అని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ ఏనాడూ తప్పులు చేయలేదని... వైకాపా బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని చంద్రబాబు తేల్చి చెప్పారు.

తెదేపాను కాదు.. ఏపీనే టార్గెట్ చేశారు: చంద్రబాబు

ABOUT THE AUTHOR

...view details