తెదేపా అధికారప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిని తన నివాసానికి వెళ్లి చంద్రబాబు పరామర్శించారు. పట్టాభిపై దాడి అతిదారుణం, కిరాతకమని అన్నారు. పట్టాభిపై దాడిని ఖండించారు. ఇటీవల కాలంలో ప్రభుత్వంపై, ప్రభుత్వం చేస్తున్న అవినీతి కార్యక్రమాలపై సాక్ష్యాధారాలతో పట్టాభి నిలదీస్తున్నందునే దాడులకు పాల్పడ్డారని పేర్కొన్నారు.
గూండాల మాదిరి తయారయ్యారు..
ముఖ్యమంత్రి జగన్, కొందరు మంత్రులు.. రౌడీలు, గూండాల మాదిరి తయారయ్యారని విమర్శించారు. పట్టాభి పార్టీ కార్యాలయానికి వస్తుంటే, రెక్కీ నిర్వహించి మారణాయుధాలతో దాడి చేశారని చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడ దొంగలు, సంఘవిద్రోహశక్తులు, రౌడీలు వచ్చినా నిమిషంలో కనిపెట్టి, ట్రాక్ చేసే విధానాన్ని ఏర్పాటు చేశామని.. వాటి సద్వినియోగంలో డీజీపీ మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు. పట్టాభి ఎవరికి శత్రువు? అని.. ప్రజల తరుపున పోరాడటమే ఆయన చేస్తోందన్నారు. తప్పులను సరిదిద్దుకొని ముందుకుసాగాల్సిన ప్రభుత్వం ఉన్మాదులతో దాడి చేయిస్తుందా? అని చంద్రబాబు నిలదీశారు.
నా నలభై ఏళ్ల రాజకీయంలో చూడలేదు..
తన నలభై ఏళ్ల నుంచి రాజకీయాలు చూస్తున్నానని.. తమ హయాంలో ఎక్కడైన రౌడీయిజం జరిగిందా? దాడులు జరిగాయా? అని చంద్రబాబు ప్రశ్నించారు. పట్టాభి కారుపై తొలుత దాడిజరిగినప్పుడే చర్యలు తీసుకున్నా, నిందితులను పట్టుకున్నా ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదని.. ప్రజల పన్నులతో జీతం తీసుకుంటూ వారి భద్రతను విస్మరిస్తున్నారని డీజీపీపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు.