నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం పుదుచ్చేరి-చెన్నై మధ్య తీరం దాటింది. ఈ ప్రభావంతో ఉత్తర తమిళనాడు, చిత్తూరు, కడప జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ ప్రకటించింది. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
భారీ వర్షాలు..
మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాయుగుండం ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో చాలాచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వానలు, ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు(heavy rains) కురుస్తాయని, ఉత్తర కోస్తాలో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వానలు పడతాయని చెప్పారు.
చిత్తూరు జిల్లాలో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కళ్యాణి జలాశయానికి వరదనీరు పోటెత్తింది. కళ్యాణి జలాశయం 3 గేట్లను అధికారులు ఎత్తారు. స్వర్ణముఖి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.
చెరువుల్లా రహదారులు..
తిరుపతిలో వర్షం బీభత్సం సృష్టించింది. పలు ప్రాంతాలు నీటమునిగాయి. వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించిన అధికారులు.. స్కావెంజర్స్ కాలనీ, ఎల్బీనగర్ హైస్కూల్‌లో.. ఎమ్మార్‌పల్లి కేశవరెడ్డి స్కూల్, పద్మావతిపురంలోని హైస్కూల్, యశోధనగర్‌లోని లిటిల్ ఏంజెల్స్‌లో భోజన వసతి కల్పించారు.