వరద నష్టం అంచనా వేసేందుకు.. కేంద్ర బృందం (Central Team tour in flood effected areas) రాష్ట్రానికి రానుంది. నేటి నుంటి మూడు రోజులపాటు.. చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల్లో పర్యటించనుందని విపత్తుల శాఖ కమిషనర్ కన్నబాబు తెలిపారు. కేంద్ర హోంశాఖ సలహాదారు కునాల్ సత్యార్ధి నేతృత్వంలో రెండు బృందాలు పర్యటించనున్నారని వెల్లడించారు.
ముఖ్యమంత్రి జగన్ లేఖకు స్పందించిన కేంద్ర హోం మంత్రిత్వ శాఖ.. ఈ మేరకు బృందాన్ని రాష్ట్రానికి పంపుతోంది. కేంద్రం నుంచి వచ్చే ఏడుగురు సభ్యులు.. రెండు బృందాలుగా విడిపోయి మూడు జిల్లాల్లో పర్యటిస్తారు. ఈ నెల 26న చిత్తూరు, 27న చిత్తూరు, కడప, 28న నెల్లూరు జిల్లాల్లో పర్యటించి వరద నష్టం అంచనా వేస్తారు. 29న ముఖ్యమంత్రి జగన్తో భేటీ అవుతారు.
లేఖలు రాసి చేతులు దులుపుకున్నారు: జీవీఎల్
ముఖ్యమంత్రి జగన్ సహాయం కోరిన వెంటనే.. కేంద్రం స్పందించి అధికారుల బృందాన్ని రాష్ట్రానికి పంపుతోందని భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహరావు(mp gvl news) స్పష్టం చేశారు. అయితే.. వరద సహాయక చర్యల విషయంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం సరిగా స్పందించలేదని జీవీఎల్ ఆరోపించారు. విపత్తు సహాయ నిధి కింద గతంలో కేంద్రం ఇచ్చిన నిధులను ఎందుకు ఖర్చు చేయలేదని నిలదీశారు.