అపెక్స్ కౌన్సిల్ భేటీ ఫలవంతంగా జరిగిందని కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తెలిపారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వాదనలు వినిపించారని.. కొత్త ప్రాజెక్టుల డీపీఆర్‌లు ఇచ్చేందుకు సుముఖత తెలిపారని షెకావత్ వెల్లడించారు. పరిధి నిర్ణయాధికారం కేంద్రానిదేనని స్పష్టం చేసిన షెకావత్.. కృష్ణా బోర్డును విజయవాడ తరలించేందుకు అంగీకారం కుదిరిందన్నారు.
కృష్ణా, గోదావరి జలాల అంశంపై అపెక్స్ కౌన్సిల్‌లో 5 కీలక నిర్ణయాలు తీసుకున్నామని కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ వెల్లడించారు. నాలుగేళ్ల తర్వాత రెండో అపెక్స్ కౌన్సిల్ భేటీ జరిగిందన్నారు. సమస్యల పరిష్కారానికి ఇద్దరు ముఖ్యమంత్రులు సిద్ధంగా ఉన్నారని షెకావత్ తెలిపారు. ప్రాజెక్టుల వారీగా కృష్ణా జలాల పంపకాలపై ట్రైబ్యునల్ నిర్ణయిస్తుందన్నారు. బోర్డుల ద్వారా మాత్రమే శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టుల నిర్వహణ జరుగుతుందని కేంద్రమంత్రి స్పష్టంచేశారు. కృష్ణా యాజమాన్య బోర్డును విజయవాడకు తరలించాలని నిర్ణయం జరిగిందన్నారు. కొత్త ప్రాజెక్టుల డీపీఆర్‌లు ఇచ్చేందుకు ఇద్దరు ముఖ్యమంత్రులు అంగీకరించారని షెకావత్ వెల్లడించారు. కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని నోటిఫై చేయాలని నిర్ణయించగా.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అభ్యంతరం చెప్పారని పేర్కొన్నారు. నోటిఫై చేసే అధికారం కేంద్రానికి ఉందన్న షెకావత్.. అందుకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
సుప్రీంకోర్టులో కేసు ఉపసంహరణకు తెలంగాణ అంగీకారం తెలిపిందన్న కేంద్ర మంత్రి.. వెనక్కి తీసుకున్న తర్వాత న్యాయ పరిశీలన చేసి ముందుకెళ్తామన్నారు. నదీ జలాల పంపిణీపై రెండు రాష్ట్రాల ప్రతిపాదనలు ట్రైబ్యునల్‌కు పంపిస్తామని వెల్లడించారు. అన్ని ప్రాజెక్టుల సాంకేతిక అంచనాలు త్వరలోనే నిర్ణయిస్తామని జల్‌శక్తి శాఖ వెల్లడించింది. ఏడాదికి ఒకసారైనా అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించేలా చూస్తామని తెలిపింది.