ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కేంద్రం ఏపీకి అన్ని విధాలా అండగా నిలుస్తోంది : కిషన్‌రావు కరాడ్‌ - ఏపీకి కేంద్రం నిధుల కేటాయింపుపై కేంద్రమంత్రి కరాడ్ వ్యాఖ్యలు

Central minister Karad on Budget : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అన్నివిధాలా అండగా నిలుస్తోందని ఆర్థికశాఖ సహాయ మంత్రి భగవత్‌ కిషన్‌రావు కరాడ్‌ అన్నారు. గోదావరి- కృష్ణా- పెన్నా నదుల అనుసంధానం ద్వారా ఈ ప్రాంత ప్రజల ఆర్ధిక స్థితిగతులు గణనీయంగా మెరుగుపడతాయనే ఆశాభావం వ్యక్తంచేశారు.

Central minister Karad
భగవత్‌ కిషన్‌రావు కరాడ్‌

By

Published : Feb 6, 2022, 2:55 PM IST

Updated : Feb 7, 2022, 5:06 AM IST

Central minister Karad on Budget: ఏపీలో ఆర్థిక క్రమశిక్షణ లోపించిందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్‌ కిషన్‌రావు కరాడ్‌ విమర్శించారు. అందుకే సమస్యలేర్పడుతున్నాయన్నారు. రాబడికి తగ్గట్టు ఖర్చులుండాలని సూచించారు. సంక్షేమ పథకాల అమలుకు ఏపీ సీఎం జగన్‌ వద్ద డబ్బుల్లేవని ఆయన వివరించారు. ఉద్యోగులకు జీతాలు పెంచలేని పరిస్థితి రాష్ట్రంలో నెలకొందంటూ తాజాగా వారి ఆందోళనను ప్రస్తావించారు. విజయవాడలో ఆదివారం నిర్వహించిన మేధావుల సమావేశంలో ఆయన కేంద్రం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ప్రాధాన్యాలను వివరించారు. బ్యాంకర్ల సమావేశంలో పాల్గొన్నారు. పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఓబీసీ మోర్చా కార్యకర్తల సమావేశంలోనూ ప్రసంగించారు. అంతకుముందు విలేకరులతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి కేంద్రం అన్ని విధాలా సహకరిస్తోందని కేంద్ర మంత్రి చెప్పారు. రాష్ట్రంలో రూ.64,684 కోట్లతో జాతీయ రహదారులను అభివృద్ధి చేస్తున్నామన్నారు. ‘ఆర్‌బీఐ ఆధ్వర్యంలో వచ్చే ఆర్థిక సంవత్సరంనుంచి డిజిటల్‌ రూపాయి లావాదేవీలు ప్రారంభమవుతాయి. దేశవ్యాప్తంగా 75 జిల్లాల్లోని 75 బ్యాంకుల్లో పూర్తిస్థాయి డిజిటల్‌ లావాదేవీలను నిర్వహించనున్నాం’ అని వెల్లడించారు. చిరువ్యాపారులకు ముద్ర పథకం కింద హామీలేని రుణాలివ్వడంపై బ్యాంకులు మరింత దృష్టి పెట్టాలని బ్యాంకర్లకు సూచించారు. వివిధ కేంద్ర పథకాల అమల్లో దేశ సగటుకంటే ఆంధ్రప్రదేశ్‌లోని బ్యాంకుల పురోగతి బాగుందని ప్రశంసించారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో పార్టీ అధికారం చేపట్టే దిశగా కార్యకర్తలు పోరాడాలని పిలుపునిచ్చారు.

అమరావతికి రూ.10వేల కోట్లు వెచ్చిస్తాం

భాజపా అధికారంలోకి వస్తే మూడేళ్లలో రూ.10వేల కోట్లు అమరావతికి ఖర్చు చేస్తామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చెప్పారు. అమరావతే రాష్ట్ర రాజధాని అని పార్లమెంటులో కేంద్రం ప్రకటించిందని గుర్తుచేశారు. ప్రధాని మోదీ వంద రత్నాలిస్తుంటే రాష్ట్రంలో అప్పులు చేసి నవరత్నాలు ఇస్తున్నారని ఎద్దేవా చేశారు.

రైల్వేలైన్‌కు వాటా నిధులివ్వలేని ఏపీ ప్రభుత్వం.. మాకు రైల్వేలైన్లు వద్దు, కట్టలేమనడం దౌర్భాగ్యమని ఎంపీ సీఎం రమేశ్‌ దుయ్యబట్టారు. కార్యక్రమాలలో ఎమ్మెల్సీలు పీవీఎన్‌ మాధవ్‌, వాకాటి నారాయణరెడ్డి, భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు వి.సూర్యనారాయణరాజు, శివన్నారాయణ, సత్యనారాయణ, భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆదినారాయణరెడ్డి, డాక్టరు పార్థసారథిÅ, మాలతీరాణి తదితరులు పాల్గొన్నారు.

అమరావతిలో పనులు చేపట్టాలి

అమరావతిలో కేంద్ర ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన భవనాల నిర్మాణాన్ని చేపట్టేలా చూడాలని అమరావతి రైతు ఐకాస కన్వీనర్‌ సుధాకర్‌ తదితరులు కేంద్ర మంత్రి కరాడ్‌కు విన్నపమిచ్చారు. అమరావతిలో 25 కేంద్రప్రభుత్వ శాఖలు 18 కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలకు భూకేటాయింపులు జరిగాయని ఆయన వివరించారు.

మెట్రో ఊసు లేదేం?

కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి సంబంధించి విజయవాడ, విశాఖపట్నం మెట్రోరైల్‌ఊసేలేదని ఆంధ్ర ఛాంబర్స్‌, ఇండస్ట్రీ ఫెడరేషన్‌ తరఫున పొట్లూరి భాస్కరరావు మేధావుల సమావేశంలో పేర్కొన్నారు. ‘రాష్ట్రానికి పారిశ్రామిక రాయితీలివ్వాలి. కొత్తగా ఏర్పాటుచేసే లాజిస్టిక్‌ పార్కుల్లో ఒకదాన్ని రాష్ట్రానికి కేటాయించాలి. వందే భారత్‌ రైళ్లలో 40నుంచి 50వరకు ఏపీ మీదుగా ఉండేలాచూడాలి’ అని కోరారు. ‘గుంటూరులో మిరప క్లస్టర్‌ ఏర్పాటుచేసి విలువ జోడించిన ఉత్పత్తుల తయారీకి చేయూతనివ్వాలి. ఎగుమతి పన్నును తగ్గించాలి. వ్యవసాయ పరికరాల దిగుమతిపై పన్ను తగ్గించాలి’ అని మిరప ఎగుమతిదారుల సంఘం ప్రతినిధులు విన్నవించారు.

ఇదీ చదవండి :Minister Perni Nani on State finance : రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఘోరాతి ఘోరంగా ఉంది: మంత్రి పేర్ని నాని

Last Updated : Feb 7, 2022, 5:06 AM IST

ABOUT THE AUTHOR

...view details