గతంలో... 2013-14 ధరల ప్రకారం రూ.29,027.95 కోట్లుగా లెక్కించి అందులో తాగునీటి విభాగానికి, విద్యుత్తు కేంద్ర నిర్మాణానికి అయ్యే నిధులను మినహాయించి రూ.20,398.61 కోట్లు మాత్రమే ఇస్తామని కేంద్ర ఆర్థిక శాఖ పేర్కొంటూ కేంద్ర జలశక్తి శాఖకు లేఖ రాసింది. ఈ అంశాన్ని పీపీఏ సమావేశంలో ఆమోదించి పంపిన తర్వాతే మిగిలిన నిధులు విడుదల చేస్తామని షరతు పెట్టింది. ఈ నేపథ్యంలో నవంబరు 2న జరిగిన పీపీఏ సమావేశంలో అంచనాల సవరణపై చర్చించిన విషయం తెలిసిందే. అనంతరం కేంద్ర ఆర్థిక శాఖ ప్రతిపాదనలకు ఆమోదం తెలియజేస్తూనే ఈ ప్రాజెక్టు పూర్తి కావాలంటే ఆ నిధులు సరిపోవని, రూ.47,725.74 కోట్లు ఇవ్వాల్సిందేనని పీపీఏ సిఫార్సు చేసింది. అందులో తాగునీటి విభాగం కింద కేటాయించిన రూ.7,214.67 కోట్లు మినహాయించకుండా ఇవ్వాలని కూడా స్పష్టం చేసింది. ఈ సిఫార్సులను కేంద్ర జలశక్తి శాఖ... కేంద్ర జలసంఘానికి పంపి మదింపు చేయాలని సూచించింది. కేంద్ర జల సంఘంలో సీనియర్ సభ్యుడు హల్దర్ ఆధ్వర్యంలోని బృందం దీన్ని అధ్యయనం చేసి తాజాగా సానుకూల నివేదికను పంపింది. ఏపీ జలవనరులశాఖ అధికారులు ఈ విషయాన్ని ధ్రువీకరించారు.
పోలవరం తాజా ధరలపై కేంద్ర జల సంఘం సానుకూలం - పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర జల సంఘం వార్తలు
పోలవరం నిర్మాణానికి 2017-18 ధరల ప్రకారం రూ.47,725.74 కోట్ల నిధులు ఇస్తేనే (తాగునీటికయ్యే రూ.7,214.67 కోట్లతో సహా) ప్రాజెక్టు పూర్తి చేయగలరని గతంలో పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) చేసిన సిఫార్సుకు కేంద్ర జలసంఘం సానుకూలంగా స్పందించింది. ఈ మేరకు కేంద్ర జలశక్తి శాఖకు నివేదించినట్లు ఏపీ జలవనరుల శాఖ అధికారులకు వర్తమానం అందింది. దీనికి సంబంధించిన దస్త్రం కేంద్ర ఆర్థిక శాఖకు పంపే అవకాశం ఉంది.
పోలవరం తాజా ధరలపై కేంద్ర జల సంఘం సానుకూలం