విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, రామాయపట్నం పోర్టు నిర్మాణంపై పార్లమెంటులో కేంద్ర మంత్రులు స్పష్టతనిచ్చారు. మెరుగైన ఉత్పాదకత, ఉద్యోగాల కల్పన కోసమే విశాఖ ఉక్కు కర్మాగారంలో పెట్టుబడులు ఉపసంహరించుకోవాలని నిర్ణయించినట్లు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. రామాయపట్నం పెద్ద పోర్టు కాదని రాష్ట్ర ప్రభుత్వమే చెప్పిందని.. సాయం చేయలేమని మరో కేంద్రమంత్రి మన్‌సుఖ్ మాండవీయ స్పష్టతనిచ్చారు.
విశాఖ స్టీల్ ప్లాంట్లో వందశాతం పెట్టుబడుల ఉపసంహరణ
విశాఖ ఉక్కు కర్మాగారంలో మెరుగైన ఉత్పాదకత, ఉద్యోగాల కల్పన కోసమే..పెట్టుబడులు ఉపసంహరించుకోవాలని నిర్ణయించినట్లు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. విశాఖ ఉక్కు కర్మాగారం వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. విశాఖ ఎంపీ సత్యనారాయణ అడిగిన ప్రశ్నకు లోకసభలో లిఖిత పూర్వక సమాధానం ఇచ్చిన ఆమె.. ఈ కర్మాగారంలో రాష్ట్రానికి ఎటువంటి ఈక్విటీ షేర్ లేదన్నారు. వంద శాతం పెట్టుబడుల ఉపసంహరణ చేయాలని నిర్ణయం జరిగిందన్నారు. భాగస్వాములు, ప్రస్తుత ఉద్యోగులతో..షేర్ కొనుగోలు ఒప్పందం కోసం ప్రత్యేక ప్రతిపాదన పెట్టినట్లు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ లిఖితపూర్వక సమాధానంలో పేర్కొన్నారు.