ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 4, 2022, 7:06 PM IST

ETV Bharat / city

ఏపీకి రూ.28 వేల కోట్లు ఇచ్చాం.. రాష్ట్రాభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: కేంద్రం

రెవెన్యూ లోటు కింద ఆంధ్రప్రదేశ్‌కు ఇప్పటివరకు రూ.28 వేల కోట్లు ఇచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆర్థిక సంఘాల సిఫార్సు మేరకు 2015 నుంచి 2021 మధ్య గ్రాంటు కింద ఈ నిధులు విడుదల చేసినట్లు ఎంపీ విజయసాయి అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి ఇంద్రజిత్ సింగ్ రాజ్యసభలో సమాధానమిచ్చారు.

ఏపీకి రూ.28 వేల కోట్లు ఇచ్చాం
ఏపీకి రూ.28 వేల కోట్లు ఇచ్చాం

రెవెన్యూ లోటు కింద ఆంధ్రప్రదేశ్‌కు ఇప్పటివరకు రూ.28 వేల కోట్లు ఇచ్చినట్లు రాజ్యసభకు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి ఇంద్రజిత్ సింగ్ ఈ మేరకు సమాధానం ఇచ్చారు. ఆర్థిక సంఘాల సిఫార్సు మేరకు 2015 నుంచి 2021 మధ్య గ్రాంటు కింద ఈ నిధులు విడుదల చేసినట్లు వెల్లడించారు. సెంట్రల్‌ డివిజబుల్‌ పూల్‌ నుంచి రాష్ట్రాలకు పంపిణీ చేసే పన్నుల విషయంలో.. సాధారణ కేటగిరీ రాష్ట్రాలు, ప్రత్యేక కేటగిరీ రాష్ట్రాల మధ్య 14వ ఆర్థిక సంఘం ఎలాంటి వ్యత్యాసమూ నిర్దేశించలేదని స్పష్టంచేశారు.

సెంట్రల్ పూల్‌లో జమయ్యే పన్నులు, సెస్‌ల పంపిణీలో రాష్ట్రాల వాటాను 14వ ఆర్థిక సంఘం 32 శాతం నుంచి 42 శాతానికి పెంచుతూ సిఫార్సు చేసినందున.. ప్రత్యేక హోదా రాష్ట్రాలకు వివిధ రూపాల్లో కేంద్రం చేసే సహాయాన్ని రద్దు చేసినట్లు స్పష్టత ఇచ్చారు. 15వ ఆర్థిక సంఘం కూడా ఇదే విధానాన్ని సమర్థించినట్లు ఇంద్రజిత్ సింగ్ పేర్కొన్నారు. కేంద్ర ప్రాయోజిత పథకాల హేతుబద్దీకరణకు నియమించిన ముఖ్యమంత్రుల ఉపసంఘం సిఫార్సులను అనుసరించి.. కేంద్ర పథకాల్లో రాష్ట్రాల వాటాను కూడా మార్పు చేసినట్లు తెలిపారు.

ఉపసంఘం సిఫార్సులకు అనుగుణంగా ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలు.. కేంద్ర పథకాల్లో తమ వాటా కింద 10 శాతం చెల్లించాలన్నారు. సాధారణ కేటగిరీ ఉన్నవాటికి కేంద్ర పథకాల్లో కేంద్రం 60 శాతం నిధులు భరిస్తే, రాష్ట్రాలు 40 శాతం సమకూర్చాల్సి ఉంటుందన్నారు. 2016 - 17 నుంచి ఈ విధానం అమల్లోకి వచ్చినట్లు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టం, ఆర్థిక సంఘాల సిఫార్సుల మేరకు.. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఇంద్రజిత్ సింగ్ స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: కొత్త జిల్లాల్లో భూముల మార్కెట్ ధరల సవరణ..పెరగనున్న రిజిస్ట్రేషన్ ఛార్జీలు

ABOUT THE AUTHOR

...view details