Smart Meters for Agricultural Electricity: వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు పెట్టాలనే అంశంపై వెల్లువెత్తిన వ్యతిరేకతతో కేంద్రం వెనకడుగు వేసింది.గతేడాది విద్యుత్ చట్ట సవరణ బిల్లు ముసాయిదాలో పేర్కొన్న ఆ నిబంధనను తొలగించింది. సాగు మోటార్లకు కరెంటు సరఫరా చేసే ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద మీటర్లు పెట్టి వ్యవసాయానికిచ్చే కరెంటును లెక్కించాలని సూచించింది. అలానే ముసాయిదాలో పేర్కొన్న విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)ల డీలైసెన్సింగ్ నిబంధననూ పక్కన పెట్టింది. విద్యుత్ రంగ ప్రైవేటీకరణ లక్ష్యంతో గతేడాది రూపొందించిన విద్యుత్ చట్ట సవరణ బిల్లులో కేంద్రం తాజాగా పలు మార్పులు చేసింది. ఈ బిల్లు తొలి ముసాయిదాను తెలంగాణ, తమిళనాడు, పశ్చిమబెంగాల్ సహా పలు రాష్ట్రాల సీఎంలు తీవ్రంగా వ్యతిరేకించిన విషయం తెలిసిందే. సవరించిన విద్యుత్ బిల్లును ఈ నెలలో ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టి ఆమోదం పొందాలని కేంద్ర విద్యుత్‌శాఖ కసరత్తు చేస్తోంది.
ఇవీ మార్పులు..
- ఒకే ప్రాంతంలో రెండు లేదా అంతకన్నా ఎక్కువ సంస్థలకు విద్యుత్ పంపిణీకి లైసెన్సులిస్తే రాష్ట్ర ప్రభుత్వం ‘క్రాస్ సబ్సిడీ నిధి’ని ఏర్పాటుచేయాలి.
- ఇతర దేశాలకు కరెంటు అమ్ముకోవచ్చనే నిబంధనను సైతం ముసాయిదాలో తొలగించారు.
- హైకోర్టు న్యాయమూర్తి ఛైర్మన్‌గా ఒక సెలక్షన్ కమిటీని ఏర్పాటుచేసి రాష్ట్ర ఈఆర్‌సీ పాలకమండలిని నియమించాలనే నిబంధనను తొలగించారు. ఒకవేళ రాష్ట్ర ఈఆర్‌సీ పాలకమండలిలో ఛైర్మన్, సభ్యుల పదవులను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయకుండా ఖాళీగా ఉంచితే ఆ రాష్ట్ర ఈఆర్‌సీ బాధ్యతలను పక్క రాష్ట్రాల ఈఆర్‌సీకి అప్పగించే అధికారం కేంద్రానికి కల్పిస్తూ నిబంధన పెట్టారు.
- ఏటా కరెంటు ఛార్జీల సవరణకు డిస్కంలు సకాలంలో ప్రతిపాదనలు ఇవ్వకపోతే ఆటోమేటిక్‌గా ఛార్జీలు సవరించే అధికారాన్ని ఈఆర్‌సీకి కల్పిస్తూ తొలుత పెట్టిన నిబంధనను తొలగించారు. ఛార్జీల పెంపును ఈఆర్‌సీ పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని ప్రతిపాదించారు. రాష్ట్ర ఈఆర్‌సీకి సాధారణ సివిల్ కోర్టుకు ఉండే అధికారాలుంటాయి.
మెగావాట్‌కు పైగా వాడేవారికి...