ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఏపీ పరిమితికి మించి అప్పులు చేసింది: కేంద్ర ఆర్థికశాఖ

By

Published : Jul 27, 2021, 6:13 PM IST

Updated : Jul 28, 2021, 4:15 AM IST

ఏపీ పరిమితికి మించి అప్పులు చేసిందని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. 2020-21 ఏడాదిలో రూ.4 వేల కోట్లు పరిమితికి మించి అప్పులు చేసినట్లు కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్‌ చౌదరి వెల్లడించారు.

ఏపీ పరిమితికి మించి అప్పులు చేసింది
ఏపీ పరిమితికి మించి అప్పులు చేసింది

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2020-21 ఆర్థిక సంవత్సరంలో కేంద్రం అనుమతిచ్చిన దానికంటే తీసుకున్న అదనపు రుణం... సవరించిన అంచనాల ప్రకారం రూ.4,872 కోట్లకు చేరే అవకాశం ఉంది. మంగళవారం రాజ్యసభలో తెదేపా సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్‌ అడిగిన రెండు ప్రశ్నలకు కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్‌చౌదరి ఇచ్చిన సమాధానం ఈ విషయాన్ని వెల్లడించింది. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు గత ఏడాది ఏపీకి జీఎస్‌డీపీలో 3% రుణం తీసుకోవడానికి అవకాశం ఉంది. దాని ప్రకారం 30,305 కోట్ల రుణం తీసుకోవడానికి కేంద్రం అవకాశం కల్పించింది. కొవిడ్‌ కారణంగా ఆర్థిక వనరులు దెబ్బతినడంతో అన్ని రాష్ట్రాలకూ 2% అదనపు రుణాలకు అవకాశం కల్పించి, దాంతో సంస్కరణలను ముడిపెట్టింది. ఏపీ ప్రభుత్వ సంస్కరణల ప్రకారం 1.90% మేర రూ.19,192 కోట్ల అదనపు రుణానికి అనుమతి ఇచ్చింది. అంతా కలిపి రూ.49,497 కోట్ల రుణం తీసుకునే వెసులుబాటు కలిగినా రాష్ట్ర ప్రభుత్వం అప్పు రూ.54,369 కోట్లకు చేరే అవకాశం ఉన్నట్లు బడ్జెట్‌ ప్రతుల ద్వారా వెలుగులోకి వచ్చింది. దీన్ని బట్టి రాష్ట్ర ప్రభుత్వం రూ.4,872 కోట్ల అదనపు రుణం తీసుకున్నట్లు కనిపిస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌ సహా అన్ని రాష్ట్రాలూ వాటి సొంత ఎఫ్‌ఆర్‌బీఎం చట్టాలు చేసుకున్నాయి. వాటికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందా లేదా? అన్నది సంబంధిత శాసన వ్యవస్థలే చూస్తాయి. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో ఎంతమేరకు రుణాలు తీసుకోవాలన్నదానిపై ఆర్థిక సంఘం పరిమితులు విధిస్తూ ఆర్థిక మార్గసూచి నిర్దేశిస్తుంది. అందువల్ల ఆంధ్రప్రదేశ్‌ సహా అన్ని రాష్ట్రాల నికర రుణ పరిమితులను ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారమే నిర్ణయిస్తాం. 2015-16 నుంచి 2020-21 వరకు జీఎస్‌డీపీలో 3% మేర ఆర్థికలోటు ఉండటానికి ఆర్థిక సంఘం అనుమతి ఇచ్చింది. 15వ ఆర్థిక సంఘం సిఫార్సు ప్రకారం 2021-22 ఆర్థిక సంవత్సరంలో జీఎస్‌డీపీలో రుణ పరిమితిని 4%కి పెంచింది. అందువల్ల 2021-22లో రూ.42,472 కోట్లు తీసుకోవడానికి వీలుంది. 2019-20లో పన్నుల వాటా తగ్గడంతో ఆ ఏడాది ప్రత్యేకంగా రూ. 2,534 కోట్ల అదనపు రుణం తీసుకోవడానికి కేంద్రం అనుమతి ఇచ్చింది. 2020-21లో జీఎస్‌డీపీలో అదనంగా 2% రుణం తీసుకో వడానికి అనుమతి ఇవ్వగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 1.90%మేర రూ.19,192 కోట్ల రుణం తీసుకొంది. ఎఫ్‌ఆర్‌బీఎం చట్టంలో సవరణలు చేసిన తర్వాతే అదనపు రుణం తీసుకోవడానికి అనుమతి ఇచ్చాం’ అని కేంద్ర మంత్రి తెలిపారు.

ఇదీ ఆర్థిక లోటు

డిచిన ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌ ఆర్థికలోటు రూ.54,369.18 కోట్లని కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్‌చౌదరి తెలిపారు. 2020-21 బడ్జెట్‌ సవరణలను అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు లోటును అంచనా వేసి ఈ విషయాన్ని 2021-22 బడ్జెట్‌ పత్రాల్లో పేర్కొందని తెలిపారు. కాగ్‌ మాత్రం తన వెబ్‌సైట్‌లో మార్చి చివరి నాటికి ఆంధ్రప్రదేశ్‌ ఆర్థికలోటును రూ.53,702.73 కోట్లుగా చూపిందన్నారు. ఆంధ్రప్రదేశ్‌ దయనీయమైన ఆర్థిక పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వం ఏమైనా మదింపు చేసిందా? అన్న మరో ప్రశ్నకు ఆయన లేదని సమాధానమిచ్చారు. ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం పరిధికి మించి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రుణాలు తీసుకున్న విషయాన్ని కేంద్రం గమనిస్తోందా? అన్న ప్రశ్నకు ఆయన స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు.

ఇదీ చదవండి

GOVT LANDS: స్మార్ట్ టౌన్‌ల నిర్మాణం కోసం.. 'నిరుపయోగ భూములు'!

Last Updated : Jul 28, 2021, 4:15 AM IST

ABOUT THE AUTHOR

...view details