ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

NTR welfare schemes: సంక్షేమంపై చెదరని సంతకం.. "ఎన్టీఆర్‌"!

NTR welfare schemes: అప్పటి వరకూ సంక్షేమం అంటే ప్రభుత్వాల భిక్షే.. దాన్ని అన్నార్థుల హక్కుగా మలిచిన ఘనత అన్నగారిది..! అప్పటి వరకు నేతలు విదిలించే మెతుకులే సంక్షేమం అంటే.. దాన్ని ఆత్మగౌరవంతో అందుకునేలా చేసిన చరిత అన్నగారిది..!! చెమట చిందించిన చేతులు దీనంగా చాచకూడదని.. కాయకష్టం చేసే పేదలు కడుపు మాడ్చుకోగూడదని.. అన్నపూర్ణ వంటి తెలుగు దేశాన.. అన్నమో రామచంద్రా అంటూ ఏ ఒక్కరూ ఘోషించకూడదని పరితపించారు. 2 రూపాయలకు కిలో బియ్యం వంటి సంచలన పథకం మొదలు.. పూరి గుడిసెల స్థానంలో పక్కా ఇళ్లదాకా.. ఎన్నో అనితర సాధ్యమైన పథకాలు ప్రవేశపెట్టారు. అద్వితీయమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఇవాళ సంక్షేమనామాన్ని స్మరిస్తున్న వారందరూ అనుసరిస్తున్నది అయన్నే అనడంలో అతిశయోక్తే లేదు. అందుకే.. తెలుగునాట సంక్షేమం మాటెత్తగానే ముందుగా మదిలో మెదిలే మొట్టమొదటి పేరు ఎన్టీఆర్​..!!!

NTR welfare schemes
సంక్షేమంపై చెదరని సంతకం

By

Published : May 28, 2022, 10:08 AM IST

సంక్షేమంపై చెదరని సంతకం ఎన్టీఆర్

NTR welfare schemes: సంక్షేమానికి ఆయనో బ్రాండ్ అంబాసిడర్‌..! ఆంధ్రప్రదేశ్‌కే కాదు.. యావత్ భారతానికీ సంక్షేమాన్ని పరిచయం చేసింది ఆయనే..!! సంక్షేమంతోనే సరిపెట్టకుండా.. అభివృద్ధి ఆవశ్యకతనూ గుర్తెరిగి.. "సంక్షేమం - అభివృద్ధిని" జోడెడ్ల బండిలా ముందుకు నడిపించిన రథసారథి ఆయన..!!! పథకాల అమల్లో ప్రత్యేకంగా నిలిచిన నందమూరి.. పాలనలోనూ తనదైన మార్క్‌ చూపించారు. అవినీతి, అక్రమాలకు పాతరేశారు. శాంతిభద్రతలు పరిఢవిల్లేలా చూశారు. అత్యుత్తమ విధానాలతో సుపరిపాలనకు బాటలు వేశారు ఎన్టీఆర్.

ప్రజలే దేవుళ్లు.. సమాజమే దేవాలయం :కాంగ్రెస్‌ కుంభస్థలాన్ని బద్దలు కొట్టి, పార్టీ పెట్టిన 9 నెలలకే విజయపతాకం ఎగురవేసిన ఎన్టీఆర్.. అధికారం చేపట్టాక పాలనలోనూ తనదైన ముద్ర వేశారు. ప్రజలే దేవుళ్లు, సమాజమే దేవాలయమని త్రికరణ శుద్ధిగా నమ్మిన అన్నగారు.. ప్రభుత్వ కార్యాలయాలకే పరిమితమైన పాలనను ప్రజల చెంతకు చేర్చారు. పేదల సంక్షేమానికి, బలహీనవర్గాల అభ్యున్నతికి పెద్దపీట వేశారు. మహిళా సాధికారత అంటే ఏంటో చేసి చూపించారు. రైతుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపారు. ఆ రోజుల్లోనే విదేశాల నుంచి పెట్టుబడుల్ని ఆహ్వానించారు. మొత్తంగా.. ఆంధ్ర దేశాన్ని ప్రజాపాలనకు రోల్‌మోడల్‌గా తీర్చిదిద్దారు.

14 వందలు కాదు.. 14 వేల కోట్లిస్తా : తెలుగుదేశం పార్టీ స్థాపించి, అజెండా ఖరారైన కొన్నాళ్లకే.. ఎన్టీఆర్ పథకాలపై పెద్దఎత్తున చర్చ జరిగింది. ఎన్టీఆర్ హామీల అమలు అసాధ్యమని అప్పటి ఆర్థికమంత్రి కోన ప్రభాకరావు తేల్చేశారు. వాటన్నింటికీ 14వందల కోట్లు అవసరమని లెక్కగట్టారు. పేదల కోసం 14 వందల కోట్లు కాదు.. 14 వేల కోట్లయినా ఖర్చు చేస్తామని ఎన్టీఆర్ ఘాటుగా బదులిచ్చారు. ప్రచార వేడి పెరిగేకొద్దీ సంక్షేమ అన్నగారి హామీలు జనంలోకి చొచ్చుకెళ్లాయి. 2 రూపాయలకే కిలో బియ్యం ప్రకంపనలు సృష్టించింది. కంగుతిన్న కాంగ్రెస్ పాలకులు.. ఎన్నికల ముంగిట రూపాయి 90 పైసలకే బియ్యం పథకం ప్రారంభించారు. ఈ మాయల్ని పట్టించుకోని ప్రజానీకం.. ఎన్టీఆర్ కే జైకొట్టారు.

మాట తప్పని మహోన్నతుడు : ప్రజల ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి పీఠమెక్కిన ఎన్టీఆర్.. చెప్పిన మాట ప్రకారమే పథకాలన్నీ తూ.చ. తప్పకుండా అమలు చేశారు. కోటి కుటుంబాలకు లబ్ధి చేకూర్చే 2 రూపాయలకు బియ్యం పథకానికి ప్రథమ ప్రాధాన్యం ఇచ్చారు. జనతా వస్త్రాలు, నిరుద్యోగ భృతి, వృద్ధాప్య - వితంతు పింఛన్లు, ఇంటింటి దీపం లాంటి పథకాలతో.. సంక్షేమ రాజ్య స్థాపన చేశారు. 2 రూపాయల బియ్యం పథకమైతే యావత్ దేశాన్నీ ఆకర్షించింది.

వివిధ రాష్ట్రాలు అనుసరించేలా చేసింది. పేదల ఇళ్లంటే పూరి గుడిసెలనే విధానానికి స్వస్తి పలికి.. పక్కా ఇళ్లు కట్టించారు. బీసీల జీవితాల్లో పెనుమార్పులు తీసుకొచ్చే లక్ష్యంతో ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించారు. మహిళా సాధికారతకు అసలైన అర్థం చెప్పిన ఎన్టీఆర్.. ఆస్తిలో సమాన హక్కు కల్పిస్తూ 1984లోనే చట్టం తీసుకొచ్చారు. ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో మహిళలకు శాతం రిజర్వేషన్లు తీసుకొచ్చి.. న్యాయమైన వాటా దక్కేలా కృషి చేశారు. దేశంలోనే తొలిసారిగా తిరుపతిలో మహిళా వర్సిటీ కట్టించారు. మధ్యాహ్న భోజన పథకం, బడుగు పిల్లలను విద్యావంతులుగా తీర్చిదిద్దే సంకల్పంతో గురుకుల పాఠశాలలు నెలకొల్పారు. మాతృభాషకు పట్టం కడుతూ తెలుగు వర్సిటీ ఏర్పాటుచేశారు.

అసామాన్యమైన నిర్ణయాలు : పాలనను ప్రజలకు చేరువ చేసిన ప్రజాపాలకుడు ఎన్టీఆర్. తాలూకాలు, బ్లాకులను విభజించి మండల వ్యవస్థ తీసుకొచ్చారు. ఆంధ్రా ప్రాంతంలో కరణం-మునసబు, తెలంగాణలో పటేల్‌-పట్వారీ వ్యవస్థను రద్దు చేశారు. ఇలాంటి సంస్కరణలతో పార్టీకి నష్టం తప్పదని కొందరు నేతలు ఆందోళన వ్యక్తంచేసినా లెక్కపెట్టలేదు. ప్రజలకు మేలు చేయడమే లక్ష్యమంటూ ముందడుగు వేశారు. తామొస్తే మండలాలు రద్దు చేస్తామన్న కాంగ్రెస్‌ నేతాగణం.. ఆ వ్యవస్థకు ప్రజల మద్దతు చూసి వెనుకడుగు వేశారు. ఏ కొత్త నిర్ణయం తీసుకున్నా ముందరి కాళ్లకు బంధనాలు వేస్తున్న శాసన మండలిని రద్దు చేశారు.

రైతు బిడ్డగా అన్నదాతల వెతలు తెలిసిన ఎన్టీఆర్.. సాగు బాగుకు విశేష కృషి చేశారు. వ్యవసాయానికి 50 రూపాయలకే హార్స్‌పవర్‌ విద్యుత్ ఇచ్చారు. పంటలకు ప్రాణావసరమైన సాగునీటి వసతి కల్పనకు అమిత ప్రాధాన్యం ఇచ్చారు. రైతుల భాగస్వామ్యంతో చిన్ననీటి పారుదల వ్యవస్థను అభివృద్ధి చేశారు. మరెవ్వరూ సాహసించని విధంగా కృష్ణా మిగులు జలాలతో తెలుగుగంగ ప్రాజెక్టుకు ప్రాణప్రతిష్ట చేశారు. ఒక్క ప్రాజెక్టుతో చెన్నైకి తాగునీరు, రాయలసీమకు సాగునీరు అందించారు. శ్రీశైలం కుడిగట్టు కాలువ కింద గాలేరు-నగరి, హంద్రీ-నీవాతో పాటు.. శ్రీశైలం ఎడమ గట్టు కాలువకూ బీజం వేశారు. వంశధార రెండో దశ, శ్రీరామ్‌ సాగర్‌ రెండో దశ నిర్మించారు. ఆంధ్రుల జీవనాడి పోలవరం నిర్మాణానికి సంకల్పించి.. ఆ దిశగా కొంతమేర కృషి చేశారు.

తెలుగు చరిత్రకు వైభవం.. శాంతిభద్రతలను కాపాడటంలో ఎన్టీఆర్ భేష్ అనిపించుకున్నారు. హైదరాబాద్‌లో నిత్యకృత్యంగా మారిన మత కల్లోలాలను.. పాలక పగ్గాలు చేపట్టాక పూర్తిగా అదుపు చేశారు. నగర సుందరీకరణకు పకడ్బందీ చర్యలు చేపట్టారు. న్యూయార్క్ సందర్శనలో "స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని" చూసి అచ్చెరవొందిన అన్నగారు.. ఆ స్ఫూర్తితో హుస్సేన్ సాగర్లో బుద్ధుడి విగ్రహాన్ని ప్రతిష్టించారు. తెలుగువారి చరిత్ర, సంస్కృతి, సాహిత్యాలకు విశిష్ట స్థానం కల్పిస్తూ.. ట్యాంక్ బండ్‌పై మహనీయుల విగ్రహాలు ఏర్పాటుచేయించారు.

కఠిన నిర్ణయాలు: ప్రజాసేవ పక్కాగా సాగాలనే పట్టుదలతో ఎన్టీఆర్ కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు నొచ్చుకున్నా.. ఉదయం నుంచి సాయంత్రం వరకు తప్పనిసరిగా కార్యాలయంలో ఉండాలని ఆదేశాలిచ్చారు. రిటైర్మెంట్ వయసును 58 నుంచి 55ఏళ్లకు తగ్గించారు. ఉద్యోగుల 2 నెలల సమ్మెతో.. మొండి పట్టుదలకు పోకుండా రిటైర్మెంట్ వయసుపై వెనక్కి తగ్గారు. ఉద్యోగుల్లో స్థానికేతరుల సమస్యకు పరిష్కారం చూపుతూ 610 జీఓ తీసుకొచ్చారు.

నిజమైన ప్రజాసేవకుడు : నాయకడిగాకంటే ధర్మపీఠంపై కూర్చున్న సంఘసేవకుడిగా ఉండటానికి ఎన్టీఆర్ ప్రాధాన్యం ఇచ్చారు. అవినీతి నిర్మూలనకు నడుం బిగించి.. ఉన్నతాధికారుల కార్యాలయాలు, ఇళ్లపై దాడులు చేయించారు. అవినీతి ఆరోపణలతో సహచర మంత్రి రామచంద్రరావును పదవి నుంచి తప్పించారు. 1989 - 90 వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టక ముందే వివరాలు పత్రికల్లో రావడాన్ని తీవ్రంగా పరిగణించిన ఎన్టీఆర్.. మంత్రులందరితో రాజీనామా చేయించారు. మంత్రివర్గం నుంచి తప్పించిన 31 మందిలో ఎన్టీఆర్ పెద్దల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు కూడా ఉన్నారు. వారానికి పైగా సీఎం ఒక్కరే కొనసాగిన తర్వాత.. 23మందితో కొత్త కేబినెట్‌ను కొలువుదీర్చారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details