ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఆలయాల్లో అలంకార ప్రాయంగా నిఘా నేత్రాలు - దుర్గ ఆలయంలో చోరీ తాజా వార్తలు

దేవాలయాల్లో భద్రత కోసం ఏర్పాటు చేస్తున్న నిఘా నేత్రాలు అలంకార ప్రాయంగా మారుతున్నాయి. పర్యవేక్షణ లోపంతో పనికి రాకుండా పోతున్నాయి. తాజాగా విజయవాడ దుర్గగుడిలో జరిగిన ఘటనే దీనికి నిదర్శనం. ఆలయం చుట్టూ సీసీ కెమెరాలున్నా... ఆలయ ప్రాంగణంలో ఉన్న రథం వెండి సింహపు బొమ్మలు చోరికి గురయ్యాయి.

ఆలయాల్లో అలంకార ప్రాయంగా నిఘా నేత్రాలు
ఆలయాల్లో అలంకార ప్రాయంగా నిఘా నేత్రాలు

By

Published : Sep 24, 2020, 9:01 PM IST

ఆలయాల్లో భద్రత కోసం కచ్చితంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్న నిబంధన ఉంది. దీంతో కృష్ణా జిల్లాలోని చాలా ప్రధాన ఆలయాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. కానీ.. వాటి పర్యవేక్షణ సరిగా లేకపోవడంతో అలంకారప్రాయంగా మిగులుతున్నాయి. తాజాగా విజయవాడ దుర్గగుడిలో జరిగిన సంఘటనే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. దుర్గగుడిలో అడుగడుగునా సీసీ కెమెరాలు ఉన్నా.. వెండి సింహపు బొమ్మలను ఎత్తుకెళ్లిపోయారు. చోరికి సంబంధించిన చిన్న ఆధారం కూడా ఇప్పటివరకు దొరకలేదు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినా... వాటి నిర్వహణపై దృష్టి పెట్టకపోవడం వల్లే ఈ పరిస్థితి ఎదురవుతోంది.

15 రోజుల వరకే అందుబాటులో డేటా..

విజయవాడ దుర్గగుడిలో 50 లక్షల రూపాయలకుపైగా వెచ్చించి అధునాతన సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. రెండేళ్ల కిందట ఆలయంలో అమ్మవారి చీర దొంగతనం కేసులో సీసీ కెమెరాల వైఫల్యం స్పష్టంగా కనిపించింది. దీంతో పాత కెమెరాలన్నింటిని మార్చేశారు. కొత్తగా అధునాతన సీసీ కెమెరాలు 180 వరకు ఏర్పాటు చేశారు. ఆలయంలోని ఏ ప్రదేశాన్నయినా ఇవి పర్యవేక్షించేలా ఏర్పాట్లు చేశారు. రాత్రి వేళ సైతం ఇవి స్పష్టంగా సంఘటనలను రికార్డు చేయగలవు. కెమెరాను జూమ్ చేసి స్పష్టంగా పరిశీలించేలా... అధునాతనమైనవి ఏర్పాటు చేశారు. కానీ...వీటి నిర్వహణ సక్రమంగా లేదు. వీటిలో నమోదయ్యే డాటా మొత్తం 15 రోజుల వరకే ఉంటుంది. వెండి సింహాల చోరీకి సంబంధించిన ఘటన ఈ కెమెరాల్లో రికార్డు అయినా... 15 రోజుల తర్వాత డేటా చెరిగిపోయింది. అందువల్ల సంఘటన ఎప్పుడు జరిగిందనేది తెలుసుకోవడం పోలీసులకు సాధ్యపడటం లేదు.

డీవీడీల్లో భద్రపరిస్తే సరి...

సీసీ కెమెరాల్లో నమోదయ్యే డాటా వాటికి అనుసంధానంగా ఉండే డిజిటల్ వీడియో రికార్డర్​నికి వెళ్తుంది. ఈ డీవీఆర్ సామర్థ్యం ఎంత ఉంటే... దానిని బట్టి డాటా స్టోర్ అవుతుంది. దుర్గగుడిలోని డీవీఆర్​లలో 15 రోజుల డాటా పట్టేంత సామర్థ్యం ఉంది. ఆ తర్వాత ఆటోమేటిక్​గా కొత్త డాటా వచ్చేసి.. పాతది చెరిగిపోతుంది. డీవీఆర్ నిండిపోయిన వెంటనే దానిలోని డాటాను... ఓ డీవీడీలోనికి నింపి తేదీల వారీగా భద్రపరుచుకుంటే సరిపోతుంది. 4.7 జీబీ సామర్థ్యం ఉన్న 50 డీవీడీలు ప్రస్తుతం ఆరేడు వందలకే లభిస్తున్నాయి. ఏ ఆలయంలోనూ ఇలా జాగ్రత్తగా డాటాను భద్రపరచటం లేదు. ఇప్పటికైనా... సీసీ కెమెరాల్లో నమోదయ్యే వాటిని భద్రపరిచే వ్యవస్థను తప్పనిసరి చేయాలని భక్తులు కోరుతున్నారు.

పర్యవేక్షణ లోపం..

ఆలయాల్లో ఏర్పాటు చేసిన ఒక్కో సీసీ కెమెరాను రూ. 50 వేల నుంచి రూ. 70 వేల వరకూ వెచ్చించి కొనుగోలు చేశారు. వాటిని వినియోగించటంలో శ్రద్ధ చూపటం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఆలయంలోనూ ఈ సీసీ కెమెరాల పర్యవేక్షణ బాధ్యతను కచ్చితంగా ఓ సిబ్బందికి అప్పగించలేదు. చాలాచోట్ల కెమెరాలను సైతం ఆపేసి వెళ్లిపోతున్నారు. దుర్గగుడిలో 130కిపైగా సీసీ కెమెరాల బాధ్యతను ఓ హోంగార్డుకు అప్పగించారు. ఆ తరువాత ఆలయానికి చెందిన సిబ్బంది, అధికారులు కన్నెత్తైనా చూడటం లేదు. ప్రస్తుతం వీటిలో నమోదయ్యే డాటా..నేరుగా గూగుల్ డ్రైవ్​లో స్టోర్ అయ్యే సాంకేతికత కూడా వచ్చింది. అధికారులు వీటిపై దృష్టి పెట్టి దేవాలయాలను పరిరక్షించాలని భక్తులు కోరుతున్నారు.

ఇదీచదవండి

కర్ణాటక సత్రాల భవన నిర్మాణానికి సీఎంలు జగన్, యడియూరప్ప భూమిపూజ

ABOUT THE AUTHOR

...view details