విజయవాడ నగరంలో సేకరించిన చెత్తను ఓ చోట పొగు చేసి.. ఆ తర్వాత పెద్ద వాహనాల ద్వారా ట్రాన్స్‌ఫర్ స్టేషన్లకు తరలిస్తారు. విజయవాడవ్యాప్తంగా 108 చోట్ల వీఎమ్సీ లోడర్ పాయింట్లు ఉన్నాయి. వీటి పర్యవేక్షణ కోసం గతంలోనే సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. వీటిని కార్పొరేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ కేంద్రం నుంచి పర్యవేక్షిస్తారు. డంపర్ బిన్లు నిండినా సకాలంలో తొలగించకపోతే కమాండ్ కంట్రోల్ నుంచే శానిటరీ ఇన్స్‌పెక్టర్‌కు సమాచారమిస్తారు. అయితే నగరపాలక సంస్థ వద్ద కేవలం 108 సీసీ కెమెరాలు మాత్రమే ఉన్నాయి. అవి కూడా కొన్ని ప్రాంతాల్లోనే ఉన్నాయి. దీనివల్ల నగరం మొత్తం పరిస్థితిని పర్యవేక్షించడం సాధ్యం కావడం లేదు.
పోలీసు కమిషనరేట్ పరిధిలో దాదాపు 2 వేల కెమెరాలు ఉన్నాయి. వీటిలో కార్పొరేషన్ పరిధిలో సుమారు 16 వందల కెమెరాలు వినియోగంలో ఉన్నాయి. ఇవన్నీ అత్యంత స్పష్టతతో దృశ్యాలను చిత్రీకరించేవే. పారిశుద్ధ్యంపై దృష్టి పెట్టిన వీమ్సీ కమిషనర్ రంజిత్ బాషా.. ఈ కెమేరాలను పారిశుద్ధ్య పర్యవేక్షణకు ఉపయోగించుకోవాలని భావిస్తున్నారు. ఈ విషయంలో తోడ్పాటు అందించేందుకు పోలీసు కమిషనర్ కూడా ఆమోదం తెలిపారు.