తెలుగుదేశం ముఖ్యనేతలతో ఆన్‌లైన్ సమావేశం నిర్వహించిన ఆ పార్టీ అధినేత చంద్రబాబు.. ప్రజాసమస్యలపై చర్చించి పోరాట కార్యాచరణ రూపొందించారు. ఒకే ఆదాయాన్ని రెండు విధాలుగా చూపుతూ, రాష్ట్ర ప్రభుత్వం పరిమితికి మించి అప్పులు చేస్తోందని ఆరోపించారు. రాజ్యాంగ నిబంధనలు, రుణపరిమితి చట్టాలను ఉల్లంఘిస్తూ తప్పుడు లెక్కలతో ఇష్టానుసారం చేస్తున్న అప్పులతో.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందని ఆందోళన వ్యక్తంచేశారు. తెచ్చిన సొమ్మును మింగేస్తున్న వైకాపా నేతలు, అప్పులు తీర్చేందుకు ప్రజల నడ్డివిరిచేలా రకరకాల పన్నుల పేరిట భారం వేస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రవ్యాప్తంగా 80 నియోజకవరాల్లో అక్రమ మైనింగ్‌తో సీఎం జగన్ 25 వేల కోట్ల మేర కొల్లగొట్టారని ఆరోపించారు. ఆ రాబడిని ఖజానాకు మళ్లిస్తే ప్రభుత్వానికి అప్పులు చేయాల్సిన అవసరం రాదన్నారు. నెల్లూరు జిల్లా గండేపల్లి అక్రమ మైనింగ్‌పై నిజనిర్ధారణ కమిటీ ద్వారా క్షేత్రస్థాయిలో పరిశీలించి.. వాస్తవాలు బహిర్గతం చేస్తామన్నారు. బృహత్ ప్రణాళిక ప్రకారం అమరావతి నిర్మాణం చేపట్టి, 2 లక్షల కోట్ల రాష్ట్ర సంపదను పెంపొందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
వ్యవసాయ రంగంపై నిర్లక్ష్యం..
వ్యవసాయ రంగాన్ని జగన్ నిర్లక్ష్యం చేస్తున్నారని తెలుగుదేశం నేతలు విమర్శించారు. విత్తనాల పంపిణీ, పెట్టుబడి రాయితీ, పంటబీమా, సూక్మసేద్యం, యాంత్రీకరణను పట్టించుకోవడం లేదన్నారు. ధాన్యం, జొన్నలు సహా పంట కొనుగోళ్లలో మిల్లర్లు, వైకాపా నేతల కుమ్మక్కుతో రైతులు నష్టపోయారని ఆరోపించారు. ప్రభుత్వ నిర్వాకంతో రాష్ట్రంలో సాగు విస్తీర్ణం క్రమంగా తగ్గుతోందని ఆందోళన వ్యక్తంచేశారు. ఉపాధిహామీ బిల్లుల చెల్లింపును ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేసినందున.. వడ్డీతో సహా చెల్లించాలన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో వైకాపా నమ్మించి మోసం చేస్తోందని.. పోరాటం పేరుతో పక్కదారి పట్టిస్తోందని నేతలు ధ్వజమెత్తారు. రుషికొండ రిసార్ట్స్‌ని గతంలో అభివృద్ధి చేసి, ప్రభుత్వానికి ఏటా 40 కోట్ల ఆదాయం వచ్చేలా తీర్చిదిద్దితే.. దాన్ని ధ్వంసం చేసి కొత్తగా రిసార్ట్ కడతామనడం దారుణమన్నారు. రిసార్ట్‌కు కేటాయించిన 150 ఎకరాల భూములను కొట్టేసేందుకు జగన్ కుట్ర పన్నారని ఆరోపించారు. జగన్ పాలనలో కలెక్టర్లు, ఎస్పీలు డమ్మీలుగా మారారని.. అందువల్లే కోర్టుల్లో నిత్యం అక్షింతలు తప్పడం లేదన్నారు. స్కూళ్లలో సచివాలయాలు, రైతుభరోసా కేంద్రాల ఏర్పాటుపైనా హైకోర్టు చీవాట్లు పెట్టిందన్నారు.