ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

CBN: టీడీఎల్పీ, పార్టీ ముఖ్యనేతలతో చంద్రబాబు ఆన్‌లైన్‌ భేటీ - pulichintala

వైఎస్​ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగిన నాసిరకం పనుల వల్లే పులిచింతల గేటు కొట్టుకుపోయిందని.. తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆరోపించారు. ప్రాజెక్టు పూర్తిని వైఎస్‌ ఘనతగా వైకాపా ప్రచారం చేసుకుందన్నారు. స్కామ్‌లతో పాటు స్క్రీములంటూ పెద్ద ఎత్తున అప్పులు చేస్తున్న జగన్‌ ప్రభుత్వం.. వాటిని మళ్లించి హోల్‌సేల్‌ అవినీతి చేస్తోందని ధ్వజమెత్తారు. అమరావతి పరిరక్షణ ఉద్యమం ప్రారంభమై 6వందల రోజులు పూర్తవుతున్న సందర్భంగా పార్టీ తరఫున సంపూర్ణ మద్దతు ప్రకటించారు.

cbn meeting
టీడీఎల్పీ, పార్టీ ముఖ్యనేతలతో చంద్రబాబు ఆన్‌లైన్‌ భేటీ

By

Published : Aug 7, 2021, 3:46 AM IST


పార్టీ శాసనసభ పక్షం, ముఖ్యనేతలతో తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆన్‌లైన్‌ సమావేశం నిర్వహించారు. పులిచింతల నిర్వహణ సరిగాలేదన్న చంద్రబాబు.. ప్రాజెక్టుకు అంకురార్పణ చేసింది రాజశేఖరరెడ్డి అంటూ వైకాపా నేతలు గతంలో గొప్పలు చెప్పుకున్నారని గుర్తుచేశారు. వైఎస్​ హయాంలో జరిగిన నాసిరకం పనుల వల్లే ప్రస్తుతం గేటు కొట్టుకుపోయిందని ఆరోపించారు. పోలవరాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించటంతో పాటు, నిర్వాసితులకు పరిహారం చెల్లించడంలోనూ విఫలమయ్యరని మండిపడ్డారు. తెలుగుదేశం హయాంలో పోలవరంలో ఎక్కడా అవినీతి లేదని కేంద్రం స్పష్టం చేసిందన్నారు. రాజ్యాంగ నిబంధనలు ఉల్లంఘించి ప్రభుత్వ ఆస్తులను తనఖా పెడుతూ జగన్‌.. రాష్ట్రాన్ని అప్పులమయం చేశారని ధ్వజమెత్తారు. ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వకపోగా పెన్షనర్లు కూడా రోడ్డెక్కే దుస్థితి కల్పించారని ఆక్షేపించారు. కోర్టు ఆదేశాలు సైతం లెక్క చేయకుండా నరేగా, నీరు చెట్టు పెండింగ్‌ బిల్లులు చెల్లించట్లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు.

విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను అడ్డుకోలేక పోతున్నారని విమర్శించారు. ప్రభుత్వ తీరుతో ఇప్పటికే అనేక పరిశ్రమలు రాష్ట్రం నుంచి వెళ్లిపోయాయన్న చంద్రబాబు.. కాలుష్య నియంత్రణ మండలి పేరుతో ప్రఖ్యాతిగాంచిన పరిశ్రమలను వెల్లగొడుతూ, తామే పొమ్మంటున్నామని ప్రభుత్వ సలహాదారులు మాట్లాడటం రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టడమేనన్నారు. టిడ్కో ఇళ్లపై జగన్‌ చేసిన అసత్య ప్రచారం కేంద్ర మంత్రి సమాధానంతో బట్టబయలైందన్న చంద్రబాబు.. జాతీయ సగటు కన్నా తక్కువ ధర ఉండటంతో పాటు నాణ్యంగా ఉన్నాయని కేంద్రం కితాబిచ్చిందని వెల్లడించారు. విశాఖలో వేలాది కోట్లను దోచుకుంటూ బాక్సైట్‌ మైనింగ్‌కు పాల్పడుతున్నారని ఆరోపించారు. బెయిల్‌పై విడుదలైన దేవినేనిని పోలీసులు అడుగడుగునా అడ్డుకుని మానవహక్కుల ఉల్లంఘనలకు పాల్పడ్డారని ఆక్షేపించారు.

తెలుగుదేశం ప్రభుత్వం ఆర్టీసీకి ప్రభుత్వ ఆస్తులు ఇస్తే, జగన్‌ సర్కారు ఆర్టీసీ ఆస్తుల్ని ఆర్‌ అండ్‌ బీకి అప్పగించడాన్ని చంద్రబాబు ఖండించారు. కలెక్టర్‌ కార్యాయాలు తనఖా పెట్టే దుస్థితి దేశంలో ఎక్కడా లేదని ఆక్షేపించారు. అమరావతి పరిరక్షణ ఉద్యమం ప్రారంభమై 6వందల రోజులు పూర్తవుతున్న సందర్భంగా పార్టీ తరఫున రైతులకు, ఉద్యమ నేతలకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు.

ఇదీ చదవండి:

'వైఎస్ హయాంలో నాసిరకం పనుల వల్లే.. పులిచింతల గేటు కొట్టుకుపోయింది'

ABOUT THE AUTHOR

...view details