CBN Letter To CS: గోదావరి వరదల్లో తీవ్రంగా నష్టపోయిన బాధితులకు సరైన పరిహారం అందించి ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ.. తెదేపా అధినేత చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మకు లేఖ రాశారు. వరదల కారణంగా ఉభయ గోదావరి జిల్లాలు, ఏలూరు, అల్లూరి సీతారామరాజు, కోనసీమ, అనకాపల్లి జిల్లాల్లో పెద్ద ఎత్తున ఆస్థి, పంట నష్టం వాటిల్లిందన్నారు. తినడానికి తిండి లేక, నిలువ నీడ లేక, విద్యుత్ సరఫరా నిలిచి, పసి పిల్లలకు కనీసం పాలు కూడా లభించక ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. గోదావరి వరదలపై సీడబ్ల్యూసీ హెచ్చరించినా.. ముందస్తు చర్యలు తీసుకోలేదని చంద్రబాబు ఆరోపించారు. కనీసం వరద ప్రభావంపై ప్రజలను అప్రమత్తం చెయ్యటం వారిని అక్కడినుంచి తరలించటం కూడా చెయ్యలేదని విమర్శించారు. బాధితులకు భరోసా కల్పించి, వారిని ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో కనీస వసతులు లేని కారణంగా ఏటిగట్లపైనే గుడారాలు వేసుకుని బిక్కుబిక్కుమంటూ బాధితులు కాలం వెళ్లదీశారని లేఖలో పేర్కొన్నారు. బాధితులకు అవసరమైన నిత్యావసర వస్తువులు, ఆహార పంపిణీలో కూడా ప్రభుత్వం విఫలమైందని ధ్వజమెత్తారు.
వరదల అనంతరం రాకపోకలు, కరెంట్ పునరుద్దరణలో ప్రభుత్వం ప్రణాళికాబద్దంగా వ్యవహరించలేదని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. 2020 నాటి వరదల సమయంలో పడవలు, ఆహారం, మంచినీరు తదితర ఏర్పాట్లకు సంబంధించిన పాత బకాయిలు ప్రభుత్వం చెల్లించలేదని.., అందుకే పడవలు, ఆహారం అందివ్వటంలో ఇబ్బందులు ఎదురయ్యాయన్నారు. ఉమ్మడి గోదావరి జిల్లాల్లోని లంకలు, పోలవరం విలీన మండలాల్లోని పలు గ్రామాలు 10 రోజుల పాటు వరద ముంపులోనే ఉండిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి 25 కిలోల బియ్యం, కందిపప్పు, బంగాళాదుంపలు, పామాయిల్, ఉల్లిపాయలు కేజీ చొప్పున ఇస్తామని ప్రభుత్వం ప్రకటించినా.. అది కార్యరూపం దాల్చలేదని విమర్శించారు.