రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులు, అత్యాచారాలపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రి జగన్కు మూడు పేజీల లేఖ రాశారు. రాష్ట్రంలో ప్రతిరోజూ ఏదో ఒకచోట మహిళలపై దాడులు, అత్యాచార ఘటనలు జరగటం బాధిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల పట్ల హింస, అత్యాచారాలు పెరగడటానికి ఘటనల పట్ల ప్రభుత్వ ఉదాసీన వైఖరే కారణమని లేఖలో మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా విఫలమయ్యాయని చెప్పడానికి విజయవాడ ఆసుపత్రిలో జరిగిన గ్యాంగ్ రేప్ ఘటన ప్రత్యక్ష సాక్ష్యమన్నారు. కూతురు కనిపించటం లేదని స్వయంగా పోలీస్ స్టేషన్కు వెళ్లి బాధితురాలి తల్లిదండ్రలు ఫిర్యాదు చేసినా.. పోలీసులు పట్టించుకోకపోవటం అమానుషమని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో బాధితురాలిని తాము పరామర్శించాకే ప్రభుత్వంలో చలనం వచ్చిందన్నారు. అత్యాచారం ఎప్పుడు జరిగిందో.., ఎక్కడ జరిగిందో కూడా హోంమంత్రికి తెలియకపోవటం మంత్రిగారి బాధ్యతారాహిత్యాన్ని తెలియజేస్తోందని విమర్శించారు.
జాతీయ క్రైమ్ బ్యూరో నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా మహిళలపై జరిగే నేరాల్లో 3వ వంతు ఏపీలోనే జరుగుతుండటం అవమానకరమని చంద్రబాబు లేఖలో దుయ్యబట్టారు. మహిళలపై జరుగుతున్న భౌతిక దాడులు, మానవ అక్రమ రవాణా, లైంగిక వేధింపుల ఘటనల్లో ఏపీ దేశంలోనే అగ్రస్థానంలో ఉండటం గర్హనీయమన్నారు. దిశా చట్టం ప్రకారం 21 రోజుల్లో నిందితులకు శిక్ష వేస్తామని ముఖ్యమంత్రిగా చేసిన వాగ్ధానం ఏమైందని ప్రశ్నించారు. రాష్ట్రంలో దిశా చట్టం అమల్లో ఉందా ? అని ప్రశ్నించిన చంద్రబాబు.., ఎన్ని కేసులను నమోదు చేసి ఎంతమందిని శిక్షించారో చెప్పాలని నిలదీశారు. ముఖ్యమంత్రి ఇంటి పక్కనే సీతానగరంలో యువతిని గ్యాంగ్ రేప్ చేస్తే నిందితుడిని ఇప్పటివరకు పట్టుకోలేదన్నారు.