రాష్ట్రంలో అస్తవ్యస్థ పాలన నడుస్తోందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు విమర్శించారు. కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు రెండోరోజు పర్యటించారు. విద్యుత్ ఛార్జీలతోపాటు.. చెత్తపైనా పన్ను వేసే చెత్తపాలన ఎక్కడ చూడలేదంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటిస్తున్న చంద్రబాబు రెండోరోజు పరమసముద్రం, మోడల్ కాలనీ, డీకే పల్లెలో గ్రామాల్లో రోడ్‌షో నిర్వహించారు. కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో తెదేపా అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
లక్ష్మీపురంలో పార్టీ జెండా ఆవిష్కరించి పాదయాత్ర ప్రారంభించిన చంద్రబాబు.. వరదరాజస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సామగుట్టపల్లె బయల్దేరి వెళ్లారు. లక్ష్మీపురంలో రోడ్ షో నిర్వహించారు. ఆ తర్వాత ఆర్.ఎస్ పేట మసీదులో మతపెద్దలతో కలిసి ప్రార్థనల్లో పాల్గొన్నారు.
రెండున్నరేళ్లలో రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని చంద్రబాబు తీవ్రంగా విమర్శించారు. వైకాపా పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేకపోగా.. పన్నుల భారం మిగిలిందన్నారు. విద్యుత్ బిల్లులు పట్టుకుంటేనే షాక్ కొడుతున్నాయన్నారు. రైతులపై విద్యుత్ భారం మోపే ప్రయత్నాలు సాగుతున్నాయన్న చంద్రబాబు.. రెస్కోను డిస్కంలో కలపడానికి ఏ మాత్రం అంగీకరించబోమన్నారు.
వ్యవసాయ యాంత్రీకరణ, బిందు సేద్య రాయితీ పూర్తిగా ఎత్తివేశారని మండిపడ్డారు. చివరకు చెత్త, మరుగుదొడ్లపైనా పన్నులు వేస్తున్నారని విమర్శించారు. జగన్ అవినీతి పాలనను, అక్రమార్జనను ప్రశ్నిస్తే.. తెలుగుదేశం కార్యాలయాలపైనా దాడులకు పాల్పడుతున్నారని.. ఇలాంటి వారి ఆటలు కట్టించేందుకు ప్రజల మద్దతు కావాలని చంద్రబాబు కోరారు.
ఇదీ చదవండి:Raithu Nestham Awards: కరోనా వేళ.. అన్నదాతల కృషి మరచిపోలేం: వెంకయ్యనాయుడు