ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

జగన్ పాలనలో రాష్ట్రం.. నరకాంధ్రప్రదేశ్​గా మారింది: చంద్రబాబు - జగన్​పై చంద్రబాబు ఫైర్

వైకాపా మూడేళ్ల పాలనలో ఏపీ నరకాంధ్రప్రదేశ్​గా మారిపోయిందని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. పార్టీ ముఖ్యనేతలతో సమావేశం నిర్వహించిన ఆయన.. మహిళలపై దాడులు, రైతు ఆత్మహత్యలపై పోరాటాలు నిర్వహించేందుకు కమిటీలు వేయాలని నిర్ణయించారు. నిరసన తెలిపిన పార్టీ మహిళా నేతలు, కార్యకర్తలపై అట్రాసిటీ కేసులు పెట్టడం ప్రభుత్వ బలహీనతను చాటుతున్నాయని పేర్కొన్నారు.

జగన్ పాలనలో ఏపీ నరకాంధ్రప్రదేశ్​గా మారిపోయింది
జగన్ పాలనలో ఏపీ నరకాంధ్రప్రదేశ్​గా మారిపోయింది

By

Published : May 2, 2022, 5:59 PM IST

Updated : May 3, 2022, 6:38 AM IST

వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ ఆ పార్టీ గూండాల ఆగడాలు పెచ్చుమీరిపోయాయని, ప్రజలు నిరంతరం భయభ్రాంతులతో జీవితం గడుపుతున్నారని తెదేపా అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. గడిచిన మూడు నాలుగు రోజుల్లో రాష్ట్రంలో పలుచోట్ల మహిళలపై అఘాయిత్యాలు, దోపిడీలు, బలహీనులపై దౌర్జన్యాలు వంటి సంఘటనలు జరిగాయని తెలిపారు. శాంతి భద్రతల పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తూ సోమవారం ఆయన డీజీపీ రాజేంద్రనాథరెడ్డికి లేఖ రాశారు. ‘ఏలూరు జిల్లాలో గంజి ప్రసాద్‌ హత్య వెనుక అధికార పార్టీ శాసనసభ్యుడు తలారి వెంకట్రావు, ఆయన అనుచరులున్నారని మృతుడి భార్య ఆరోపించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో ముఖ్యమంత్రి నివాసానికి, డీజీపీ కార్యాలయానికి అత్యంత సమీపంలో కోటేశ్వరరావు అనే వృద్ధుడిపై సాక్షి విలేకరి నాగిరెడ్డి పట్టపగలే దాడి చేసినా ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదు? విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో మానసిక స్థితి సరిగాలేని యువతిపైనా, దుగ్గిరాల మండలం తుమ్మపూడిలో మరో మహిళపైనా జరిగిన దారుణ అత్యాచార ఘటనలు మరవకముందే.. రేపల్లె రైల్వేస్టేషన్‌లో ఎస్సీ మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. దాడి చేసిన దుర్మార్గులు మద్యం, గంజాయి మత్తులో ఉన్నారని తేలింది. రాష్ట్రంలో మద్యం, గంజాయి, మాదక ద్రవ్యాల వినియోగం పెచ్చుమీరడంవల్లే నేరాలు పెరిగాయనడానికి ఈ ఘటనలే నిదర్శనం’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

మాదక ద్రవ్యాల రవాణాలో అధికార పార్టీ నేతలు:‘గంజాయి స్మగ్లింగ్‌ చేస్తున్నందుకు నర్సీపట్నానికి చెందిన గంగరాజు, నానాజీ అనే ఇద్దరు వైకాపా నాయకుల్ని పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు. సత్తెనపల్లికి చెందిన ఒక వ్యక్తి విజయవాడ నుంచి ఆస్ట్రేలియాకు మాదక ద్రవ్యాల్ని పంపించినట్లు బయటపడటం దిగ్భ్రాంతి కలిగించింది. మాదక ద్రవ్యాలు విచ్చలవిడిగా దొరకడంతో ఆ మత్తులో దుండగులు విచక్షణ కోల్పోయి ఘోరమైన నేరాలకు పాల్పడుతున్నారు’ అని చంద్రబాబు ఆందోళన వ్యక్తంచేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పునరుద్ధరణకు కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరారు.

నినాదాలు చేసినందుకే అట్రాసిటీ కేసులా?:మహిళలకు భరోసా ఇవ్వాలంటూ మహిళా మంత్రి కాన్వాయ్‌ వద్ద నినాదాలు చేసినందుకే ఒంగోలులో 17 మంది తెలుగు మహిళలపై అట్రాసిటీ కేసులు పెట్టడం దుర్మార్గమని చంద్రబాబు మండిపడ్డారు. తల్లులకు వారి బాధ్యతల గురించి చెప్పే ప్రజాప్రతినిధులు ముందు వారి బాధ్యతేంటో తెలుసుకోవడం అత్యసవరమని ఆయన వ్యాఖ్యానించారు. అత్యాచారానికి గురైన మహిళ పేరును ఫిర్యాదు కాఫీలో రాసి బహిర్గతం చేసిన అధికార పార్టీ నేతలు... ఇంతకంటే గొప్పగా స్పందిస్తారని ఆశించడం తప్పేనేమో అని సోమవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు.

రేపటి నుంచి చంద్రబాబు జిల్లాల పర్యటన:తెదేపా అధినేత చంద్రబాబు ఈనెల 4వ తేదీ నుంచి పలు జిల్లాల్లో పర్యటించనున్నారు. పార్టీ ఆధ్వర్యంలో చేపడుతున్న ‘బాదుడే బాదుడు’ నిరసనల్లో ఆయన పాల్గొననున్నారు. మే 4న శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గం దళ్లవలస గ్రామంలో చంద్రబాబు పర్యటిస్తారు. 5న విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం తాళ్లవలస గ్రామంలో, 6న కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు గ్రామంలో నిర్వహించే నిరసనల్లో పాల్గొంటారు. ప్రభుత్వ పన్నుపోటు, ఛార్జీల బాదుడుపై ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పార్టీ నిరసన కార్యక్రమాలు చేపడుతోంది. ఇందులో భాగంగా చంద్రబాబు పలు జిల్లాల్లో స్వయంగా పాల్గొంటారు. మహానాడు వరకు ఆయన జిల్లాల్లో పర్యటిస్తారు.

26 మంది రైతుల ఆత్మహత్య:రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, దాడులు, అఘాయిత్యాలపై తెదేపా అధినేత చంద్రబాబు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఒక్క ఏప్రిల్‌ నెలలోనే మహిళలపై అత్యాచారాలు, హత్యలు, దాడుల ఘటనలు 31 జరగడం రాష్ట్రంలో శాంతి భద్రతల క్షీణతకు అద్దం పడుతున్నాయని పేర్కొన్నారు. మరోపక్క అప్పుల బాధలు భరించలేక ఒక్క ఏప్రిల్‌ నెలలోనే 26 మంది అన్నదాతలు ఆత్మహత్య చేసుకున్నారని వెల్లడించారు. తెదేపా వ్యూహ కమిటీ సమావేశం చంద్రబాబు అధ్యక్షతన సోమవారం ఆన్‌లైన్‌లో జరిగింది. ‘జగన్‌ పాలనతో రాష్ట్రం నరకాంధ్రప్రదేశ్‌గా మారిపోయింది. శాంతి భద్రతలు క్షీణించడం, మహిళలు, బలహీనులపై అరాచకాలు జరగడం తీవ్ర ఆవేదన కలిగిస్తున్నాయి. వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిపోయింది. అసలు వ్యవసాయశాఖ ఉందా? అన్న అనుమానం కలుగుతోంది. ఒక్క నెలలోనే 26 మంది రైతులు బలవన్మరణానికి పాల్పడ్డా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టూ లేదు. ప్రభుత్వ అస్తవ్యస్త నిర్ణయాలు, అసమర్థ పాలనవల్ల ఉపాధి రంగం తీవ్రంగా దెబ్బతింది. ఉపాధి కోసం యువత, వివిధ వర్గాల ప్రజలు వలసపోతున్నారు. ఈ పరిణామం రాష్ట్ర భవిష్యత్‌పై తీవ్ర ప్రభావం చూపుతుంది’ అని చంద్రబాబు పేర్కొన్నారు. మహిళలపై దాడులు, నేరాలపైనా, వ్యవసాయ రంగం సంక్షోభం- రైతుల ఆత్మహత్యలపైనా పార్టీపరంగా రెండు వేర్వేరు కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వ్యూహ కమిటీ సమావేశంలో పార్టీ నాయకులు పలు అంశాలపై చర్చించారు. పల్నాడు జిల్లా దాచేపల్లిలో తెదేపా నేత కానిశెట్టి నాగులు ఇంటిపై వైకాపా నాయకుల దాడిని, చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో పాల సొసైటీ ఎన్నికల్లో నామినేషన్‌కు వెళుతున్న తెదేపా నాయకుడు చలపతి నాయుడిపై వైకాపా నేతలు దాడికి పాల్పడటాన్ని తీవ్రంగా ఖండించారు. శ్రీసత్యసాయి జిల్లా సంజీవరాయనపల్లిలో తల్లికి పింఛను ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించిన కుమారుడు వేణుపై వైకాపా నేతలు, స్థానిక ఎస్‌ఐ బూతులు తిడుతూ దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. వేణుపై దాడి చేసిన వైకాపా నేతలు, ఎస్‌ఐపై చర్యలు తీసుకోవాలని డిమాండు చేశారు.

ఇదీ చదవండి: సజ్జల డైరెక్షన్​లో.. "అనంత" పోలీసులు పనిచేస్తున్నారు: జేసీ

Last Updated : May 3, 2022, 6:38 AM IST

ABOUT THE AUTHOR

...view details