బ్లాక్ మెయిల్ చేసిన వారికే.. ముఖ్యమంత్రి జగన్ మంత్రి పదవులు ఇచ్చినట్లు వైకాపాలోనే ప్రచారం జరుగుతోందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. పార్టీ ముఖ్య నేతలతో వ్యూహ కమిటీ సమావేశం నిర్వహించిన ఆయన.. జగన్ బలహీనత కేబినెట్ కూర్పులోనే తేలిపోయిందని విమర్శించారు. జగన్ ఏదో చేస్తారని భావించిన సొంత వర్గం కూడా అసంతృప్తితోనే ఉందన్నారు. అపరిచితునిలా మారిన జగన్ తీరుతో రాష్ట్ర విభజన కంటే ఎక్కువ నష్టమన్నారు. పోలవరంలో నాడు జగన్ చేసిన పాపాలే నేడు ప్రాజెక్టుకు శాపంగా మారాయని ధ్వజమెత్తారు. జగన్ పాలనతో అన్ని వర్గాల ప్రజల జీవితాల్లో అంధకారం అలుముకుందన్నారు.
నెల్లూరు కోర్టులో చోరీ వ్యవహారంలో మంత్రి కాకాణి హస్తం ఉందని చంద్రబాబు ఆరోపించారు. ఉత్తరాంధ్రలో ఎంపీ విజయసాయి రెడ్డి మూడేళ్లు దోచుకున్నారని.. ఇప్పుడు రాయలసీమకు వెళ్లింది అక్కడ దోపిడీ కోసమేనా? అని నిలదీశారు. పింఛన్ ఒకటో తేదీనే ఇస్తామని చెప్పి.. ఇప్పుడు మొదటి వారంలో కూడా పింఛను ఇవ్వటంలేదని దుయ్యబట్టారు.
వీళ్లేం మంత్రులు?
ప్రమాణ స్వీకారం అనంతరం కొందరు మంత్రులు చేసిన వ్యాఖ్యలు, వ్యవహరించిన తీరు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయని తెదేపా నేతలు అభిప్రాయపడ్డారు. జగన్‌ను అందరూ ఆరాధించాలని సమాచారశాఖ మంత్రి వేణుగోపాలకృష్ణ చెప్పడమేమిటని మండిపడ్డారు. కల్యాణదుర్గంలో మంత్రి ఉషశ్రీచరణ్ తన ఆర్భాటంతో ఒక పసిబిడ్డ ప్రాణాలు పోవడానికి కారణమవడమే కాకుండా, నిరసన తెలిపిన తెదేపా కార్యకర్తలపై కేసులు పెట్టడమేమిటని ప్రశ్నించారు. ఉత్తరాంధ్రలో మూడేళ్లు దోచుకున్న వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి ఇప్పుడు రాయలసీమకు వెళ్లింది అక్కడా దోపిడీ కోసమేనని ఆయా నేతలు విమర్శించారు. ఒకటో తేదీనే ఇంటికి వెళ్లి పింఛను ఇవ్వడానికి వాలంటీర్లను పెట్టానని చెప్పిన జగన్... ఇప్పుడు మొదటి వారంలో కూడా పింఛను ఎందుకు ఇవ్వలేకపోతున్నారని ప్రశ్నించారు. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం బొబ్బిల్ల్లంకలో బాలికపై వాలంటీర్ అత్యాచారం ఘటనను ఖండించారు.