ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మీకు చేతకాకుంటే తప్పుకోండి.. నేను పూర్తి చేసి చూపిస్తా: చంద్రబాబు

రాష్ట్రం బాగుపడాలంటే ఫ్యాన్‌ను స్విచ్ఛాఫ్‌ చేయాలని.. తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రజలకు పిలుపునిచ్చారు. అసమర్థ ప్రభుత్వంపై పోరాడేందుకు వరద బాధితులు సిద్ధంగా ఉంటే.. నాయకత్వం వహించేందుకు తెలుగుదేశం సంసిద్ధమని స్పష్టం చేశారు. పోలవరం పూర్తిచేయడం చేతకాకుంటే.. సీఎం పదవికి జగన్‌ రాజీనామా చేయాలన్న చంద్రబాబు తాను పూర్తిచేసి చూపుతానని సవాల్‌ విసిరారు.

చంద్రబాబు
చంద్రబాబు

By

Published : Jul 30, 2022, 4:02 AM IST

Updated : Jul 30, 2022, 7:13 AM IST

మీకు చేతకాకుంటే తప్పుకోండి.. నేను పూర్తి చేసి చేపిస్తా

పోలవరం విలీన మండలాల్లో తెలుగుదేశం అధినేత చంద్రబాబు రెండో రోజు పర్యటన శుక్రవారం రాత్రి పొద్దుపోయేవరకూ సాగింది. గ్రామగ్రామాన ప్రజల కష్టాలు తెలుసుకుంటూ.. బాధితులను పరామర్శిస్తూ చంద్రబాబు ముందుకుసాగారు. తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలం సహా ఏపీ విలీన మండలాలైన అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజవర్గంలోని ఎటపాక, కూనవరం, వీఆర్​ పురం మండలాల్లో చంద్రబాబు పర్యటించి.. బాధితుల కష్టాలు తెలుసుకున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని మారుమూల గ్రామాల్లోకి వెళ్లి దెబ్బతిన్న ఇళ్లు, పునరావాస కేంద్రాలను ఆయన పరిశీలించారు. వరద బాధితులకు శాశ్వత పరిష్కారం చూపే ప్రణాళిక తన దగ్గర ఉందని.. చంద్రబాబు అన్నారు. కలిసి పోరాడేందుకు నిర్వాసితులంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. వరద బాధితులకు 29 రకాల నిత్యావసరాలు ఇవ్వాలని హుద్‌ హుద్‌ సమయంలో ఇచ్చిన జీవో స్పష్టం చేస్తుంటే సీఎం కేవలం నాలుగు రకాల వస్తువులు ఇచ్చి చేతులు దులిపేసుకున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి ముందుగా పోలవరం పరిహారం బటన్‌ నొక్కాలని డిమాండ్ చేశారు.

వరదల వల్ల దెబ్బతిన్న ప్రాంతాలు, ఇళ్ల ఫోటోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టాలని బాధితులకు చంద్రబాబు పిలుపునిచ్చారు. వాటితో ప్రభుత్వాన్ని నిలదీద్దామన్నారు. ప్రభుత్వం 8 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిందన్న చంద్రబాబు.. అందులో లక్షా 75 వేల కోట్లను ముఖ్యమంత్రి తన ఖాతాలో వేసుకున్నారని ఆరోపించారు. కొట్టేసిన డబ్బులో పోలవరం నిర్వాసితులకు 22 వేల కోట్ల రూపాయలు ఇవ్వలేరా అని ప్రశ్నించారు. పోలవరం నిర్వాసితులకు పరిహారం ఎగ్గొట్టేందుకు.. కాంటూర్‌ లెవల్‌ అంటూ కొత్త కుట్రలకు తెరలేపారని దుయ్యబట్టారు. దెబ్బతిన్న రహదారులపై తిరిగి ఒళ్లు హూనమవుతున్నప్పటికీ వెరవకుండా ప్రజల కష్టాలు పంచుకునేందుకే పర్యటిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. వరద బాధితులకు తాగేందుకు మంచి నీళ్లు కూడా ఇవ్వని అసమర్థ ప్రభుత్వమిదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తోటపల్లిలో పిడుగుపాటుకు గురై చనిపోయిన ఎంపీటీసీ శ్రీదేవి కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. తాము అధికారంలోకి రాగానే పోలవరం ప్రాజెక్టు కట్టి చూపించడమే కాకుండా అందరికీ పరిహారం అందిస్తామని చంద్రబాబు భరోసా ఇచ్చారు.

మూడు వారాలుగా విద్యుత్ సరఫరా లేక అంధకారంలో ఉంటున్నామని.. కూనవరం మండలం కోతులగుట్ట వరద బాధితులు చంద్రబాబుతో ఆవేదన పంచుకున్నారు. ఈ నెల 21 నుంచీ పునరావాస కేంద్రాల్లోనే తలదాచుకుంటున్నామని... ప్రభుత్వం ఆహారం సరిగా అందించకపోగా.. అరకొరగా నిత్యావసరాలను ఇచ్చిందని విలపించారు. ఒక్కో ఇళ్లు శుభ్రం చేసుకునేందుకే 12 వేల దాకా ఖర్చు అవుతోందని వాపోయారు. వీఆర్​ పురం మండలం రేఖపల్లి వద్ద తన రెండు రోజుల పర్యటనను ముగించుకున్న చంద్రబాబు తిరిగి తెలంగాణలోని భద్రాచలం మీదుగా గన్నవరం చేరుకుని అక్కడి నుంచి అర్ధరాత్రి దాటాక హైదరాబాద్‌ బయలుదేరి వెళ్లారు.

ఇవీ చూడండి

Last Updated : Jul 30, 2022, 7:13 AM IST

ABOUT THE AUTHOR

...view details