కరోనా వేళ సమాజ శ్రేయస్సుకు అవసరమైన సమాచారం పేరిట ఆన్‌లైన్‌లో తెలుగుదేశం అధినేత చంద్రబాబు సమావేశం నిర్వహించారు. ఈ సదస్సులో ఆరోగ్య సంరక్షణ, ఫార్మా రంగాల నిపుణులు పాల్గొన్నారు. క్లిష్ట పరిస్థితుల్లో కలసికట్టుగా కరోనాను ఎలా ఎదుర్కోవాలో అంతా ఆలోచన చేయాలని చంద్రబాబు సూచించారు. కరోనాపై పోరాటంలో సమష్టి కృషి అవసరమన్నారు. 20ఏళ్ల పైబడిన వారిపైనా రెండో దశ తీవ్ర ప్రభావం చూపుతోందన్నారు. మూడో దశలో చిన్నారులపైనా తీవ్ర ప్రభావం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నందున అప్రమత్తత అవసరమని అభిప్రాయపడ్డారు. ముందుగానే సమగ్ర ప్రణాళికలు చేపడితే భవిష్యత్తు ప్రమాదాలను నివారించగలమని తెలిపారు.
సమావేశంలో వైద్య నిపుణులు..పలు సూచనలు చేశారు. 18 ఏళ్లు దాటిన వారందరికీ వ్యాక్సినేషన్ పూర్తయితే ...తర్వాత దశల్లో వీళ్లంతా ప్రమాదపు అంచు నుంచి బయటపడతారని చెప్పారు. చాలా మంది కొవిడ్ లక్షణాలు కనిపించిన మొదటి రోజే హెచ్‌ఆర్‌సీటీ స్కాన్ చేయించుకుంటున్నారని...దీని వల్ల వారి ఊపిరితిత్తుల్లో ఎలాంటి లక్షణాలు కనిపించవని వెల్లడించారు. వైరస్ లేదనుకుని చాలా మంది అశ్రద్ధ చేస్తున్నారని... ఇది విషమపరిస్థితికి దారితీస్తోందని అభిప్రాయపడ్డారు.