చాలా కాలం తర్వాత ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, తెదేపా అధినేత చంద్రబాబునాయుడు సమావేశమయ్యారు. వీరిద్దరూ ఐదు నిమిషాల పాటు ప్రత్యేకంగా చర్చించుకున్నారు. ప్రధాని మోదీ అధ్యక్షతన ఇవాళ దిల్లీలో జరిగిన ఆజాదీకా అమృత్ మహోత్సవ్ సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు. సమావేశం ముగిసిన తర్వాత.. మోదీ, చంద్రబాబు మాట్లాడుకోవడం చర్చనీయాంశంగా మారింది. 2019 సార్వత్రిక ఎన్నికల తర్వాత మోదీ, చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశమైన సందర్భాలు లేవు. తాజాగా వీరిద్దరూ ఏయే అంశాలపై చర్చించుకున్నారన్నది రాజకీయవర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఏపీలో తెదేపా, భాజపా, జనసేన మధ్య పొత్తు ఉండే అవకాశముందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మోదీ, చంద్రబాబు ప్రత్యేకంగా భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఆందోళనలో జగన్:కార్యక్రమం అనంతరం జాతీయ మీడియాతో చంద్రబాబు ఇష్టాగోష్టిగా మాట్లాడారు.జగన్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపేందుకు ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు. జనం నాడి తెలిసి జగన్ ఆందోళనలో ఉన్నారని వ్యాఖ్యనించారు. వైకాపా ప్రభుత్వానికి రాష్ట్ర అభివృద్ధిపై ధ్యాసే లేదని ఆక్షేపించారు. ఏపీ ఆర్థిక పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని.. వైకాపా ప్రభుత్వం వచ్చాక మొత్తం వ్యవస్థలు నాశనం చేశారని దుయ్యబట్టారు. తమ హయాంలో పోలవరం, అమరావతికి నడుం బిగిస్తే.. జగన్ అధికారంలోకి వచ్చాక రెండింటినీ నాశనం చేశారని మండిపడ్డారు. అనేక విపత్తులు ఎదురైనా మనదేశం ధైర్యంగా నిలబడిందని అన్నారు. అనేక దేశాల కంటే మనదేశ తలసరి ఆదాయం ఎక్కువగా ఉందని అన్నారు.