విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ ప్రభుత్వంపై దశల వారీ పోరాటానికి తెలుగుదేశం అధినేత చంద్రబాబు పిలుపునిచారు. ప్రజలపై భారం మోపడాన్ని వ్యతిరేకిస్తూ.. ప్రజా క్షేత్రంలో పోరాడాలన్నారు. పార్టీ నాయకులు, శ్రేణులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు.. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడుతూ రైతుల మెడకు ఉరితాళ్లు బిగిస్తున్నారని మండిపడ్డారు. వైకాపా అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో 7 సార్లు విద్యుత్ చార్జీలు పెంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 7 దశల్లో ప్రజలపై రూ.12 వేల కోట్ల భారం మోపారని ధ్వజమెత్తారు. రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ చేపట్టే పోరాటానికి త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తామని చంద్రబాబు తెలిపారు. తెలుగుదేశం మళ్లీ అధికారంలోకి వచ్చి ఉంటే విద్యుత్ ఛార్జీలు తగ్గించి ఉండేదని అన్నారు. జగన్ అసమర్థత, అవినీతి వల్లే విద్యుత్ వ్యవస్థ అస్తవ్యస్తమైందని విమర్శించారు. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా తెచ్చిన రూ. 25 వేల కోట్లకు పైగా అప్పు ఏం చేశారో ప్రజలకు సమాధానం చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
"విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ దశలవారీ పోరాటం చేస్తాం. రాష్ట్రస్థాయి నుంచి గ్రామస్థాయి వరకు దశలవారీ పోరాటానికి త్వరలోనే కార్యాచరణ రూపొందిస్తాం. జగన్ అధికారం చేపట్టాక ఏడుసార్లు ఛార్జీలు పెంచారు. ఛార్జీల రూపంలో ప్రజలపై రూ.12 వేల కోట్ల భారం మోపారు. జగన్ అసమర్థత వల్లే విద్యుత్ వ్యవస్థ అస్తవ్యస్తమైంది. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రూ.25 వేల కోట్లకు పైగా అప్పు చేశారు. తెచ్చిన అప్పు ఏం చేశారో ప్రజలకు సమాధానం చెప్పాలి."- చంద్రబాబు, తెదేపా అధినేత