CBN On New Districts: ప్రజల మనోభావాలకు విరుద్ధంగా జిల్లాల పునర్విభజనపై నిర్ణయం తీసుకున్నారని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా జిల్లాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంఛార్జ్లు, ముఖ్య నేతలతో ఆన్లైన్ సమావేశం నిర్వహించిన ఆయన.. వైకాపా అక్రమాలు, ప్రజా సమస్యలపై పోరాటాలు చేయాలని శ్రేణులకు సూచించారు. సమర్థ నేతలను పార్టీ వదులుకోదని.. పని చేయని వారిని ఉపేక్షించబోదని హెచ్చరించారు. క్యాసినో వ్యవహారంలో మంత్రి కొడాలి నాని తీరును ఎండగట్టడంలో.. పార్టీ నేతలు బాగా పని చేశారని కితాబిచ్చారు. విద్యుత్ చార్జీలు, పన్నులతో ప్రజలను పీక్కుతినేందుకు సీఎం జగన్ సిద్ధమయ్యారని చంద్రబాబు మండిపడ్డారు.
మార్చి నాటికి తెలుగుదేశం ఆవిర్భావం జరిగి 40 ఏళ్లు పూర్తవుతోందని ఈ సందర్భంగా కార్యక్రమాల నిర్వహణకు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు. మహానాడుతో పాటు ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా రానున్న రోజుల్లో పెద్దఎత్తున కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఎన్టీఆర్ పేరుతో తెదేపా తీసుకువచ్చిన 14 పథకాల పేర్లు తీసి వేసిన జగన్ ప్రభుత్వం.. ఇప్పుడు జిల్లాకు పేరు పెట్టి గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు.