అసమర్థ పాలనతో ముఖ్యమంత్రి జగన్ ఎప్పుడో జీరో అయ్యారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. మళ్లీ గెలవటానికి జగన్ ఏం సాధించారని నిలదీశారు. పన్నులతో ప్రజలను బాధపెట్టి.. ఇరిగేషన్, వ్యవసాయ రంగాలను నిర్వీర్యం చేసినందుకు జగన్ను మళ్లీ గెలిపించాలా ? అని ప్రశ్నించారు. తన వైఫల్యాలతో పోలవరం, అమరావతి లాంటి ప్రాజెక్టులను బలిచేసినందుకు తిరిగి అధికారం కట్టబెట్టాలా ? అని నిలదీశారు. వైకాపాకు వచ్చే ఎన్నికల్లో సింగిల్ డిజిట్ వస్తే గొప్పేనని ఎద్దేవా చేశారు. పార్టీ నేతలతో ఆన్లైన్ సమావేశం నిర్వహించిన చంద్రబాబు..వైకాపా ప్రభుత్వ పాలనపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నెత్తిన పెట్టుకున్న వైకాపా కుంపటిని ఎప్పుడు దించాలా అని జనం ఎదురుచూస్తున్నారన్నారు. నాడు నేడుపై ఏ రంగంలోనైనా చర్చకు తెలుగుదేశం సిద్దమని సవాల్ విసిరారు. ప్రభుత్వ అసమర్థ పాలనపై తెదేపా నిరసనలు, ప్రజల నుంచి వస్తున్న స్పందనతో జగన్ ఉలిక్కి పడుతున్నారన్నారు. ఎన్నికల్లో ఓటమి తప్పదని జగన్‌కు అర్థమైందని.., దాన్ని కప్పిపుచ్చేందుకే 175 సీట్లు గెలుస్తామని నమ్మబలికే ప్రయత్నం చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు.
"అసమర్థ పాలనతో సీఎం జగన్ ఎప్పుడో జీరో అయ్యారు. ఏం సాధించారని జగన్ మళ్లీ గెలుస్తారు. వైకాపాకు ఈసారి సింగిల్ డిజిట్ వస్తేనే గొప్ప. వైకాపా కుంపటిని ఎప్పుడు దించాలా అని జనం చూస్తున్నారు. ఏ రంగంలో అయినా నాడు-నేడుపై చర్చకు తెదేపా సిద్ధం. తెదేపా నిరసనలు, ప్రజల స్పందనతో జగన్ ఉలిక్కిపడ్డారు. ఎన్నికల్లో ఓటమి తప్పదని జగన్‌కు అర్థమైంది. కప్పిపుచ్చేందుకే 175 సీట్లు గెలుస్తామని నమ్మబలికే యత్నం." -చంద్రబాబు