ధైర్యం ఉంటే.. ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లండి అమరావతినే రాజధానిగా ఎందుకు కొనసాగించాలనే అంశంపై ఐకాస చేపట్టిన తొలి ప్రజాచైతన్య యాత్ర... విజయవంతమైంది. బెజవాడ బెంజ్ సర్కిల్ వద్ద... ఎక్కడైతే పోలీసులు.. బస్సుయాత్రను అడ్డుకున్నారో... అక్కడి నుంచే యాత్రను చంద్రబాబు ప్రారంభించారు. దారి పొడవునా ప్రజలు, మహిళలు పెద్దఎత్తున తరలివచ్చి ఘనస్వాగతం పలికారు. ఆటోనగర్, కానూరు, తాడిగడప, పోరంకి, పెనమలూరులో చంద్రబాబు కాన్వాయ్ ఆపి మహిళలు హారతులు ఇచ్చారు. బందరు కోనేరు సెంటరులో గంటపాటు జోలెపట్టి విరాళాలు సేకరించారు. ప్రజలు తోచిన విధంగా జోలెలో డబ్బులు వేశారు. అలా మూడు లక్షల రూపాయలకు పైగా నగదు రాగా.. వాటిని అమరావతి ఉద్యమానికి విరాళంగా ఇచ్చారు.
ఇంటికొకరు రావాలి
రాజధాని పోరాటానికి ప్రతి ఇంటి నుంచి ఒకరు కదలిరావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. మనం చేసే పోరాటం.. భవిష్యత్ తరాల వారికోసమేనని అన్నారు. అన్ని హంగులూ ఉన్న చోట నుంచి మరో ప్రాంతానికి రాజధాని మార్పు ఎందుకు చేయాల్సి వస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు.
కనీస అవగాహన లేదు
అమరావతిని అభివృద్ధి చేయటం చేతకాక..వేల కోట్ల ఖర్చంటూ ప్రభుత్వం తప్పించుకుంటుందని చంద్రబాబు ఆరోపించారు. అమరావతిలో మిగులు భూములు అమ్మడం ద్వారా ప్రభుత్వానికే ఆదాయం వచ్చేదని.. కనీసం అవగాహన లేకుండా.. నేతలు మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఒకరి నిర్ణయం..5 కోట్ల మందికి బాధ
ఒక వ్యక్తి నిర్ణయాలతో 5 కోట్ల మంది ప్రజానీకం బాధపడుతోందని చంద్రబాబు అన్నారు. శుక్రవారం కేసులకు వెళ్లే ముఖ్యమంత్రికి...ప్రజలు భూములెందుకు ఇవ్వాలని ప్రశ్నించారు. ఎన్నికల ముందు రాజధాని మార్పు అంశాన్ని ఆ పార్టీ చెప్పలేదన్న చంద్రబాబు.. ధైర్యం ఉంటే.. ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలని సవాల్ విసిరారు.
ప్రభుత్వ తీరుపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ధ్వజమెత్తారు. అమరావతిని శ్మశానంగా పోల్చుతున్న నేతలు..ప్రజల్లో తిరిగేందుకు భయపడుతున్నారని ఎద్దేవా చేశారు.
అమరావతి ఐకాస ఆధ్వర్యంలో మచిలీపట్నం కోనేరు సెంటర్‌లో చంద్రబాబు ప్రసంగిస్తుండగా విద్యుత్ సరఫరా నిలిపివేశారు. సభ జరుగుతున్న ప్రదేశంలో తప్ప మిగిలిన అన్ని ప్రాంతాల్లోనూ కరెంట్ సరఫరాకు అంతరాయం లేదు. అయితే అక్కడికి వచ్చిన ప్రజలు తమ ఫోన్ లైట్లను సభవైపు చూపించారు. కొద్దిసేపటి తరువాత విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు.
ఇదీ చదవండి: 'రాజధానిగా 3 పేర్లు చెబుతారా? నాపై కోపం ప్రజలపై తీరుస్తారా?'