సీబీఐ కేసుల తరువాతే ఈడీ కేసులను విచారణ చేపట్టాలంటూ జగతి పబ్లికేషన్స్, విజయసాయిరెడ్డి సహా ఇతర నిందితులు దాఖలు చేసిన పిటిషన్లను సీబీఐ కోర్టు కొట్టివేస్తూ ఉత్తర్వులు వెలువరించింది. జగన్ తదితరులు దాఖలు చేసిన పిటిషన్లపై సుదీర్ఘ వాదనలను విన్న సీబీఐ ప్రధాన కోర్టు న్యాయమూర్తి బి.ఆర్.మధుసూదన్‌రావు గత నెల 15న ఉత్తర్వులు వాయిదా వేశారు. సోమవారం ఉత్తర్వులు వెలువరిస్తూ నిందితులు దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్లను కొట్టివేశారు.
'ఈడీ కేసులకు ఆధారం సీబీఐ కేసులే. సీబీఐ దాఖలు చేసిన అభియోగపత్రాల ఆధారంగానే ఈడీ ఫిర్యాదులు నమోదు చేసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టానికి తీసుకువచ్చిన సవరణ ప్రకారం రెండు కేసులను ఒకే కోర్టులో విచారణ చేపట్టాలి. సీబీఐ కేసు విచారణ తరువాతే ఈడీ కేసు విచారణ చేపట్టాలి.' అని నిందితుల తరఫు న్యాయవాదులు చేసిన వాదనలను న్యాయమూర్తి తోసిపుచ్చారు. సీబీఐ కేసులతో సంబంధం లేకుండా ఈడీ కేసులపై సత్వరం విచారణ చేపట్టాలని, రెండు కేసుల్లోని అభియోగాలు వేర్వేరన్న ఈడీ తరఫు న్యాయవాది టి.వి.సుబ్బారావు వాదనతో ఏకీభవించారు. మనీలాండరింగ్ నిరోధక చట్టానికి తీసుకువచ్చిన సవరణ నేపథ్యంలో సీబీఐ కేసు కంటే ఈడీ కేసుపై ముందుగా విచారణ చేపట్టవచ్చని న్యాయమూర్తి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో ఈడీ నమోదు చేసిన 6 కేసుల్లో విచారణను ఈ నెల 21కి వాయిదా వేశారు.
హాజరైన విజయసాయిరెడ్డి