CBI Court On Jagan cases:అక్రమాస్తుల కేసుల వ్యవహారంలో ప్రధాన నిందితుడైన ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ విచారణ నిమిత్తం హాజరుకాకపోవడాన్ని మంగళవారం సీబీఐ కోర్టు ప్రశ్నించింది. హెటిరో, అరబిందోలకు భూకేటాయింపులకు సంబంధించిన కేసుపై మంగళవారం సీబీఐ ప్రధానకోర్టు న్యాయమూర్తి బి.ఆర్.మధుసూదన్‌రావు విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఈ కేసులో ప్రధాన నిందితుడైన జగన్‌మోహన్‌రెడ్డి హాజరు మినహాయింపు కోరుతూ న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ... ప్రతిసారీ ఏదో కారణం చెబుతూ హాజరుకావడంలేదని, బెయిలు షరతుల ప్రకారం ప్రతి విచారణకు హాజరుకావాలి కదా అని ప్రశ్నించారు.
Jagan cases: జగన్ విచారణకు ఎందుకు హాజరుకావట్లేదు..ప్రశ్నించిన సీబీఐ కోర్టు
18:14 December 21
సీబీఐ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ
దీనిపై జగన్ తరఫు న్యాయవాది జి.అశోక్‌రెడ్డి సమాధానమిస్తూ... బెయిలు మంజూరు చేసినప్పటి పరిస్థితులకు, ఇప్పటి పరిస్థితులకు తేడా ఉందని చెప్పారు. అప్పుడు కేవలం ఎమ్మెల్యే, ఎంపీగా ఉండేవారని ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారన్నారు. అంతేగాకుండా గతంలో నెల లేదంటే వారానికి ఒక్కరోజు మాత్రమే విచారణ ఉండేదని, ప్రస్తుతం వారానికి అయిదు రోజులపాటు విచారణ జరుగుతోందన్నారు. హాజరు తప్పనిసరని ఆదేశిస్తే హాజరవుతారన్నారు. దీంతోపాటు హాజరు మినహాయింపునకు నిరాకరిస్తూ ఈ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించామన్నారు. దీనిపై వాదనలను విన్న హైకోర్టు తీర్పును వాయిదా వేసిందన్నారు. హాజరు మినహాయింపుపై అక్కడ స్టే కోరగా ఇక్కడ పెండింగ్ విషయాన్ని సీబీఐ కోర్టులో చెప్పాలందన్నారు. వాదనలను విన్న న్యాయమూర్తి ఇదే విషయాన్ని మెమోగా దాఖలు చేయాలని ఆదేశించడంతో జగన్ తరఫు న్యాయవాది మెమో దాఖలు చేశారు. హైకోర్టులో పెండింగ్ కేసు వివరాలను మెమోలో పేర్కొన్నారు. ఈ కేసులో జగన్‌తోపాటు విజయసాయిరెడ్డి, జగతి పబ్లికేషన్స్, జనని ఇన్‌ఫ్రాలు దాఖలు చేసిన డిశ్ఛార్జి పిటిషన్‌లలో కౌంటరు దాఖలు చేయడానికి సీబీఐ గడువు కోరడంతో సీబీఐ కోర్టు విచారణను జనవరి 4కు వాయిదా వేసింది.
ఇదీ చదవండి
Petitions Withdrawn: జగన్ అక్రమాస్తుల కేసు.. క్వాష్ పిటిషన్ల ఉపసంహరణ!