CBI charge sheet on mp raghu ramakrishna raju: వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు సహా..16 మందిపై సీబీఐ ఛార్జిషీటు దాఖలు చేసింది. థర్మల్ విద్యుత్ కేంద్రం పేరుతో 3 రుణ సంస్థల నుంచి సేకరించిన రుణాలను పక్కదారి పట్టించారన్న ఆరోపణలపై సీబీఐ విచారణ జరిపింది. దిల్లీ రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టులో స్ఫెషల్ జడ్జి ఎదుట ఛార్జిషీట్ దాఖలు చేసినట్లు సీబీఐ కేంద్ర కార్యాలయం ప్రకటించింది.
రఘురామకృష్ణరాజుకు చెందిన 'ఇండ్ భరత్ పవర్ మద్రాస్ సంస్థ'.... పీఎఫ్సీ, ఆర్ఈసీ, ఐఐఎఫ్‌సీఎల్ నేతృత్వంలోని రుణదాతల కన్సార్షియం నుంచి సుమారు రూ. 947 కోట్ల 71 లక్షల రుణం తీసుకుందని నివేదించింది. ఈ సంస్థ తమిళనాడులోని టుటికోరిన్‌లో ఉందని వివరించింది. నిబంధనలకు విరుద్ధంగా ఇండ్ భరత్ సంస్థ థర్మల్ విద్యుత్ కేంద్రం నెలకొల్పకుండా పలు బ్యాంకులకు ఫిక్స్‌డ్ డిపాజిట్ల రూపంలో పక్కదారి పట్టించారని విచారణలో తేలినట్లు సీబీఐ పేర్కొంది. కన్సార్షియం నుంచి తీసుకున్న రుణాలతో థర్మల్ విద్యుత్ కేంద్ర నిర్మాణం పూర్తి చేయకపోగా.. ఇతర నిందితులతో కలిసి అక్రమంగా నిధులు వినియోగించడం వల్ల కన్సార్షియం 947 కోట్ల 71 లక్షలు నష్టపోయిందని వివరించింది.