ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 16, 2020, 5:58 AM IST

Updated : Jul 16, 2020, 12:03 PM IST

ETV Bharat / city

ఏపీ ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న కారులో రూ.5.27 కోట్ల నగదు

ఎమ్మెల్యే స్టిక్కర్‌తో ఉన్న కారులో తరలిస్తున్న రూ.5.27 కోట్లను తమిళనాడులోని గుమ్మిడిపూండి సమీపంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఒంగోలుకు చెందిన ముగ్గురిని అరెస్టు చేశారు. ఆ వాహనంపై ప్రకాశం జిల్లాకు చెందిన కీలక ప్రజాప్రతినిధి స్టిక్కర్‌ ఉండటం తీవ్ర కలకలం రేపింది.

ఏపీ ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న కారులో రూ.5.27 కోట్ల నగదు
ఏపీ ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న కారులో రూ.5.27 కోట్ల నగదు

తమిళనాడులోని గుమ్మిడిపూండి సమీపంలో ఎమ్మెల్యే స్టిక్కర్‌తో ఉన్న కారులో తరలిస్తున్న రూ.5.27 కోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఒంగోలుకు చెందిన ముగ్గురిని అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం... ఆంధ్రప్రదేశ్‌ నుంచి చెన్నైకి కొందరు గంజాయి రవాణా చేస్తున్నారని ఆరంబాక్కం పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు బుధవారం వేకువజామున ఎలావూరులోని చెక్‌పోస్టు దగ్గర వాహన తనిఖీలు చేపట్టారు. ఆ వైపుగా వచ్చిన ఎమ్మెల్యే స్టిక్కర్‌ ఉన్న కారును ఆపి తనిఖీ చేశారు. వెనుక సీట్లో నాలుగు సంచుల్లో ఉన్న రూ.5.27 కోట్లను స్వాధీనం చేసుకున్నారు. వాహనంలో ఉన్న ఒంగోలుకు చెందిన నాగరాజ్‌, వసంత్‌, కారు డ్రైవరు సత్యనారాయణన్‌లను అరెస్టు చేశారు. నగదును ఆదాయపన్నుశాఖ అధికారులకు అప్పగించారు. కేసు దర్యాప్తులో ఉంది. కారుపై ఎమ్మెల్యే స్టిక్కర్‌ ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. దాని రిజిస్ట్రేషను నంబరు టీఎన్‌ 66ఈ 1166 అని ఉంది. కారు కోయంబత్తూరు సెంట్రల్‌ ఆర్టీవో పరిధిలోని వి.రామచంద్రన్‌ పేరిట ఉన్నట్లు సమాచారం.

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం

నగదుతో వాహనం చిక్కిన వ్యవహారం ఏపీలో సంచలనం రేపుతోంది. ఆ వాహనంపై ప్రకాశం జిల్లాకు చెందిన కీలక ప్రజాప్రతినిధి స్టిక్కర్‌ ఉండటం తీవ్ర కలకలం రేపింది. అందులో ప్రయాణిస్తున్న వారిలో ముగ్గురు పోలీసులకు చిక్కగా, మరో ఇద్దరు సంఘటనా స్థలం నుంచి పరారైనట్లు ప్రచారం సాగుతోంది. నిందితుల్లో నగదు బదలాయింపులో కీలకంగా వ్యవహరించిన బంగారం వ్యాపారితో పాటు రాజకీయ నాయకుడి తనయుడు ఉన్నట్లు రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తోంది.

అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలి

"రాత్రి చెన్నై పోతున్న ఓ కారును పోలీసులు పట్టుకున్నారని ఉదయం నాకు తెలిసింది. దాని మీద నా పేరిట స్టిక్కర్‌ ఉన్నట్లు మీడియాలో వస్తోంది. అది ఫొటో జిరాక్స్‌ కాపీ. ఆ కారులో ఉన్న వ్యక్తులు ఒంగోలు వాసులు కావడంతో దాన్ని నాకు ఆపాదిస్తున్నారు. అది నాకు సంబంధించినది కాదు. వాహనంలో రూ.5 కోట్లు ఉన్నాయని చెబుతున్నారు. అది తమిళనాడు రిజిస్ట్రేషన్‌ వాహనం. దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపించాలి. ఎవరిది తప్పైతే వారిని శిక్షించాలని కోరుతున్నా."

- మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి

ఇదీచదవండి

రాష్ట్రంలో కొత్త జిల్లాలు... అధ్యయనానికి కమిటీ ఏర్పాటు

Last Updated : Jul 16, 2020, 12:03 PM IST

ABOUT THE AUTHOR

...view details