కరోనా మహమ్మారి దెబ్బకు ప్రైవేటు, ప్రభుత్వ రంగాలు కుదేలయ్యాయి. అన్నీ సవ్యంగా ఉన్నప్పుడే పెద్దగా గిరాకీ లేక ఆపసోపాలు పడుతూ కాలం నెట్టుకొస్తున్న కార్గో సర్వీసుకు కరోనా కాలంలో బాగా గిరాకీ పెరిగింది. ఫలితంగా ఆర్డర్లు ఆశాజనకంగా ఉన్నాయి. తిరిగి కార్యకలాపాలు ప్రారంభించిన పది రోజుల్లోనే దాదాపు 20 టన్నుల మేర సరకును చేరవేసింది. ఈ స్ఫూర్తితో ప్రజా రవాణా శాఖ భవిష్యత్తులో మరింత రాబడి సాధించే దిశగా అడుగులు వేస్తోంది. ప్రైవేటు సంస్థలు మూతపడడం కూడా కలిసొచ్చింది. దీంతో పలువురు ఆర్టీసీ వైపు చూస్తున్నారు.
లాక్‌డౌన్ కారణంగా మార్చి 22 నుంచి ఆర్టీసీ తన కార్యకలాపాలను ఆపింది. ప్రయాణికుల సర్వీసులతో పాటు కొరియర్, కార్గో సేవలను కూడా నిలిపివేసింది. గత నెలలో ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో సరకు రవాణాను ప్రారంభించింది. జిల్లాలోని వివిధ డిపోల నుంచి సరకు రవాణా వాహనాల ద్వారా చేరవేస్తోంది. గురువారం నుంచి ప్రభుత్వ పాఠ్య పుస్తకాల తరలింపు ఆర్డర్‌ను డీఈవో ఇచ్చారు. ఆటోనగర్‌లోని విద్యా శాఖ గోదాము నుంచి జిల్లాలోని అన్ని ఎంఈవోల కార్యాలయాలకు దాదాపు 16 లక్షల పుస్తకాలను తరలిస్తున్నారు. నూజివీడు నుంచి హైదరాబాద్‌కు దాదాపు 6 టన్నుల వరకు మామిడిని చేరవేశారు.