కేవలం మాటలతో వివరాలు తెలియజేసి.. నివారణ మార్గాలు తెలుసుకోవడమే కాదు. ఇప్పుడు వాట్సప్ ద్వారా చిత్రాలు, దృశ్యాలు పంపిస్తే క్షుణ్నంగా వాటిని పరిశీలించి- శాస్త్రవేత్తలు, నిపుణులను ఆయా రైతులతో నేరుగా మాట్లాడిస్తారు. పంటకు అధిక నష్టం లేకుండా తక్కువ సమయంలోనే పరిష్కార మార్గాలను వారి ముందు ఉంచేలా రాష్ట్ర స్థాయి సమీకృత సేవా కేంద్రం పనిచేస్తోంది. ఈ కేంద్రం వ్యవసాయ, అనుబంధ శాఖలను సాగుదారుని చెంతకు తీసుకెళ్లడంలో కీలక భూమిక పోషిస్తోంది.
ఫోన్ చేస్తే..చాలు
కృష్ణా జిల్లా గన్నవరం వద్ద జాతీయ రహదారి ఆనుకునే ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్ ఏర్పాటైంది. రైతుభరోసా పథకంలో భాగంగా వ్యవసాయ అనుబంధ శాఖలకు సంబంధించి పూర్తి వివరాలు అందించేందుకు సమీకృత రైతు సమాచార కేంద్రం మూడు నెలల క్రితం ప్రారంభించారు. టోల్‌ఫ్రీ నెంబరు 155251కు ఫోన్ చేస్తే వ్యవసాయ, ఉద్యాన, పశు సంవర్థక, మత్స్య, పట్టుపరిశ్రమ, పాడి పరిశ్రమాభివృద్ధి, మార్కెటింగ్‌శాఖల పరిధిలోని సమాచారాన్ని తెలుసుకునేందుకు వీలుగా ఈ కేంద్రం నెలకొల్పారు. వ్యవసాయ, అనుబంధ రంగాలకు చెందిన రైతులకు వివిధ శాస్త్ర సాంకేతిక సాగులో ఎదురయ్యే సమస్యలకు చెందిన పలు సందేహాలు నివృత్తి చేయడం ఈ కేంద్రం ప్రధాన ఉద్దేశం.
రోజూ వందల మంది రైతుల ఫోన్లు
పంటకు చీడపీడలు ఆశించినా.. అధిక వర్షాలతో ఎర్ర బారినా.. ఏ ఎరువు ఎంత మోతాదులో వేయాలో తెలుసుకోవాలన్నా.. ఒక్క ఫోన్ చేస్తే చాలు పరిష్కారం చెబుతున్నారు. ఫొటో తీసి పంపించినా సరైన సూచనలిస్తున్నారు. అవసరమైతే శాస్త్రవేత్తలతోనూ నేరుగా మాట్లాడి సందేహాలు తీర్చుకునే వెసులుబాటు కల్పించారు. పంటలో నష్టం తీవ్రత ఎక్కువగా ఉంటే శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు, నిపుణులకు పొలానికే పంపిస్తున్నారు. రైతు భరోసా, ఈ-క్రాపింగ్, వడ్డీలేని రుణాలు, బీమాతోపాటు వివిధ పథకాలకు సంబంధించిన సమస్యలపైనా ఈ టోల్‌ఫ్రీ నెంబరుకు ఫోన్ చేసి సమస్యలు తీర్చుకునే అవకాశం కల్పించారు. వ్యవసాయ, అనుబంధశాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సమీకృత సేవా కేంద్రానికి రైతుల నుంచి స్పందన పెరుగుతోంది. జూన్ 1 నుంచి ఏర్పాటు చేసిన ఈ కేంద్రానికి రోజూ 500 నుంచి 700 మంది రైతులు ఫోన్ చేసి తమ సందేహాలు నివృత్తి చేసుకుంటున్నారు.
ఉదయం నుంచి సాయంత్రం వరకూ..
ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు సేవా కేంద్రం పనిచేస్తుంది. ఒక్కో షిప్టులో 32 మంది చొప్పున మొత్తం 67 మంది విధుల్లో ఉంటూ.. రైతుల నుంచి ఫోన్లు స్వీకరిస్తున్నారు. వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్థక విశ్వవిద్యాలయాల నుంచి ఐదుగురు శాస్త్రవేత్తల బృందం అక్కడే ఉంటూ రైతుల సందేహాలను నివృత్తి చేస్తోంది. వీరికి అదనంగా.. పంటల వారీగా నిపుణులైన 32 మంది శాస్త్రవేత్తల సేవలను వినియోగించుకునేందుకు ప్రభుత్వం వారితో ఒప్పందం చేసుకుంది. సేవా కేంద్రంలోని సిబ్బంది అంతా వ్యవసాయ, సాంకేతిక అంశాల్లో అనుభవజ్ఞులైన వారే. రైతు నుంచి ఫోన్ కాల్ స్వీకరించి.. తమ పరిధిలోని వివరాలతో సమాధానం ఇస్తారు. వాటిపై ఇంకా రైతుల్లో అనుమానాలు, అదనపు సమాచారం కోసం సందేహాలు ఉంటే ఆ ఫోన్ కాల్‌ను శాస్త్రవేత్తలకు చేరవేసి వారితో నేరుగా మాట్లాడిస్తున్నారు. పంటలకు ఆశించే తెగుళ్లు, మొక్కల పరిస్థితి, పశువుల అనారోగ్య సమస్యలు, ఆక్వాలో వైరస్ తదితర సమస్యలను తెలిపేలా ఫొటోలు తీసి సేవా కేంద్రంలోని నంబర్లకు పంపవచ్చు.
- సాగులో సందేహం ఉంటే ఫోన్ చేయాల్సిన నెంబరు 155251(టోల్‌ఫ్రీ)
- చీడపీల సమస్యలపై ఫోటోలను చేరేవేసేందుకు... వాట్సప్ నెంబర్లు
- 83310 56028
- 83310 56150
- 83310 56153
- 83310 56149
- 83310 56152
- 83310 56154