వ్యాపారంలో రాణించాలంటే.. ఇతర సంస్థలతో పోటీపడాలి. కానీ సూక్ష్మ, మధ్య, చిన్న తరహా పరిశ్రమల్లో అలా కాదు. ఒక ఉత్పత్తి తయారు కావాలంటే పది పరిశ్రమల సహకారం కావాలి. ఒకరు బాగుపడితే పదిమందీ బాగు పడతారు. ఒకరు నష్టపోతే పదిమందికీ నష్టమే. ఈ తరహా సప్లై చైన్ మేనేజ్మెంట్ కలిగిన పరిశ్రమలన్నీ ఇప్పుడు తీవ్ర నష్టాలతో కొట్టుమిట్టాడుతున్నాయి. ఇందుకు కారణం పెరిగిన ముడి సరుకుల ధరలేనని యాజమాన్యాలు చెబుతున్నారు.
రాష్ట్రంలో దాదాపు 97వేల చిన్న పరిశ్రమలు ఉన్నాయి. ఉత్పత్తి వ్యయంలో.. ముడి సరుకుల వాటా 70శాతం వరకు ఉంటుంది. గతేడాది నవంబర్ ధరలతో పోలిస్తే ఇనుప పలకల ధర 75శాతం పెరిగింది. తుక్కు ఇనుము ధర 88శాతం, కోకింగ్ కోల్ ధర 96శాతం పెరిగాయి. ఈ స్థాయిలో తమ ఉత్పత్తుల ధరలను పెంచే అవకాశం లేదని నిర్వాహకులు వాపోతున్నారు.