ఓ సంస్థ తక్కువ వడ్డీకి రుణం ఇస్తామంటే తీసుకోవడం తప్పా అని మంత్రి బుగ్గన ప్రశ్నించారు. ఆ సంస్థ పేరు ఇప్పుడే చెప్పలేమని... ఈ ప్రతిపాదన ఇంకా ప్రాథమిక దశలోనే ఉందన్నారు. మాజీ ఆర్థిక మంత్రి వారానికోసారి రాష్ట్ర ఆర్థిక అంశాలపై ఏవేవో మాట్లాడుతున్నారని... ఆయన దగ్గర సరైన వివరాలు లేవని అనిపిస్తోందని బుగ్గన మండిపడ్డారు. వృద్ధిరేటు పడిపోయిందని చెబుతున్న యనమల ఎక్కడ పడిందో చెప్పగలరా? అని నిలదీశారు. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ నెమ్మదించినా ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఎక్కడా ఏపీ వెనకబడిన దాఖలాలు లేవని బుగ్గన స్పష్టం చేశారు.
2016-17కు స్థూల ఉత్పత్తి 6 లక్షల 99 వేల కోట్లు అని అంచనా వేశారు.. కానీ అది తగ్గిందని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ గుర్తుచేశారు. మూడోసారి వేసిన అంచనాలతో 30 నుంచి 40 వేల కోట్లు తగ్గిందన్నారు. ఆ తదుపరి ఏడాది సవరించిన అంచనాలు కూడా 70 వేల కోట్లు తేడా వచ్చిందని.. ఇదంతా టీడీపీ హయాంలోనే జరిగిందని దుయ్యబట్టారు. భారత్లో వృద్ధిరేటు ఒక అంకె ఉంటే అప్పట్లోనే ఏపీ రెండు అంకెల వృద్ధి అని చెప్పుకొచ్చారని... అది పూర్తిగా అవాస్తవమని దుయ్యబట్టారు.
దక్షిణాది రాష్ట్రాల్లో ఏపీ ద్రవ్యోల్బణం అతి తక్కువగా 3.4గా నమోదు అయ్యిందని,వాస్తవాలు లేకుండా యనమల నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని బుగ్గన ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రస్తుతం ఆర్థిక మందగమనం కారణంగా కేవలం 3 వేల కోట్ల మేరే తగ్గిందని.. గత ప్రభుత్వ నిర్ణయాల కారణంగా మూల ధన వ్యయం తగ్గిన మాట వాస్తవమని బుగ్గన తెలియజేశారు. రహదారులు, ప్రాజెక్టులపై మళ్లీ ఖర్చు పెంచుతున్నామని.. రెవెన్యూ లోటు, ద్రవ్య లోటు తగ్గిందన్నారు. గతంలోని 15 వేల కోట్ల బకాయిలు చెల్లింపు కారణంగా రెవెన్యూ లోటు పెరిగిందని ఆర్థికమంత్రి తెలిపారు. గతంలోని బకాయిలు వడ్డీలు కూడా 16 వేల కోట్ల రూపాయలు చెల్లించామని వివరించారు.
బహిరంగ మార్కెట్‌లో రుణాలు ఎక్కువే చేశామన్న బుగ్గన... కొన్నిసార్లు తప్పదు అని వ్యాఖ్యానించారు. 1 లక్ష 14 వేల కోట్లు కేంద్ర పన్నులు, రాష్ట్ర పన్నులు కలిపి వస్తున్న ఆదాయమని... తెదేపా ప్రభుత్వం విపరీతమైన అప్పులు రాష్ట్ర ప్రజల నెత్తిన మోపిందని ఆర్థికమంత్రి దుయ్యబట్టారు. ఈసారి బడ్జెట్లో అన్ని శాఖలకు కేటాయింపులు పెరిగాయని.. తెదేపా హయం కంటే వైకాపా ప్రభుత్వం మంచి కేటాయింపులు చేసిందన్నారు. 3 కోట్ల 99 లక్షల లబ్ధి దారులకు 42 వేల 603 కోట్ల రూపాయలు వివిధ పథకాల ద్వారా చెల్లింపులు చేశామని బుగ్గన స్పష్టం చేశారు. పోలవరానికి నిధులు, జీఎస్టీ పాత బకాయిలు 248 కోట్లు, రెవెన్యూ లోటు బకాయిలు ఇలా కేంద్రాన్ని కోరామన్నారు. రామాయపట్నం, కడప స్టీల్ ప్లాంట్ తదితర అంశాలపై కేంద్రాన్ని కోరిన్నట్లు ఆయన వివరించారు.
ఇదీ చదవండి: జియోలో గూగుల్ రూ.30 వేల కోట్ల పెట్టుబడి!